Feb 13,2023 23:37

పాఠశాల భవనం కూల్చివేత తర్వాత పరిశీలిస్తున్న కార్పొరేటర్‌, అధికారులు

- బాధ్యునిపై చర్యలకు పోలీసులకు ఫిర్యాదు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన కార్పొరేటర్‌, అధికారులు
ప్రజాశక్తి -భీమునిపట్నం
: జివిఎంసి నాల్గో వార్డు కాపులుప్పాడ, పాత పరదేశిపాలెంలో మూతబడిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనం కూల్చివేతపై ఎంపిడిఒ వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదే గ్రామానికి చెందిన ఓ రియల్టర్‌ ఆదివారం అర్థరాత్రి సమయంలో వీధి దీపాలు ఆర్పేసి, తన జెసిబి సాయంతో భవనాన్ని కూల్చివేశారు. సమాచారం తెలుసుకున్న వార్డు కార్పొరేటర్‌ దౌలపల్లి కొండబాబు, తహశీల్దార్‌ కోరాడ వేణుగోపాల్‌, సిఐ కె లక్ష్మణమూర్తి, ఎంపిడిఒ పి వెంకటరమణ, ఎంఇఒ కెఎ.బాలా మణి పాఠశాల హెచ్‌ఎం, విఆర్‌ఒ జి అప్పారావు సోమవారం ఆయా ప్రాంతాన్ని పరిశీలించారు.
బాధ్యులపై చర్యలకు పోలీసులకు ఫిర్యాదు
శిధిలావస్థకు చేరిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనాన్ని రాత్రి వేళ విద్యుత్‌ సరఫరా నిలిపేసి, చీకట్లో జెసిబి సాయంతో గుట్టుగా కూల్చేసిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ వెంకటరమణ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శిధిలావస్థకు చేరిందని...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ఈ పాఠశాల భవనాన్ని 1989 ఆగస్టు 26న అప్పటి జెడ్‌పి చైర్మన్‌ బాకూరి చిన అప్పలరాజు, నాటి ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌డిపి అప్పల నరసింహరాజుతో కలిసి ప్రారంభించారు. 15 ఏళ్ల క్రితమే ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో సమీపాన కొత్త భవనాన్ని నిర్మించి, పాఠశాలను అక్కడికి మార్పు చేయడంతో పాత భవన నిరుపయోగమై శిథిలావస్థకు చేరుకుంది.44మంది విద్యార్థులున్న ఈ పాఠశాల కొత్త భవనానికి నాడునేడు నిధులతో అభివృధ్ధి చేస్తున్నా, పాత భవనాన్ని పట్టించుకోక శిథిలావస్థకు చేరుకుంది.
అన్యాక్రాంతమైన పాఠశాల స్థలం
పాఠశాల భవన నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన ఒకవ్యక్తి అప్పట్లో ఎనిమిది సెంట్లు స్థలాన్ని దానం చేశారని,ఈ స్థలం అన్యాక్రాంతం కావడంతో ఇపుడు మూడు సెంట్లు మాత్రమే మిగిలిందని స్థానికులు అంటున్నారు. ప్రజాప్రయోజనానికి సొంతస్థలాలను అధికారికంగా ప్రభుత్వానికి సంస్థలుగానీ, వ్యక్తులుగానీ ఎవరు దానం చేసినా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు, అధికారం వారికి ఉండబోదని ఎంపిడిఒ వెంకటరమణ, ఎంఇఒ బాలామణి తెలిపారు.