Nov 08,2023 22:41

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ఉండ్రాజవరం విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ఇచ్చిన పిలుపుతో జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. రాజమహేంద్రవరం నగరంలో పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్‌ అనంతరం కోటిపల్లి బస్టాండు సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు భూషణం, పిడిఎస్‌యు సంయుక్త కార్యదర్శి ఎస్‌.కిరణ్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజా, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌ తదితరులు మాట్లాడారు. 32 మంది విద్యార్థి, యువజ నుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయాలనుకోవడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 1000 రోజులుగా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలు పాల్గొనడంతోపాటు బుధవారం విద్యాసంస్థల బంద్‌ నిర్వహించడం జరిగిం దన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ప్యాక్టరీని ఎలా ప్రయివేటీక రిస్తారని వారు ప్రశ్నించారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాల అభివృద్ధి కావాలంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని దీని ద్వారానే రాయలసీమ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మోేడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేస్తున్నా రాష్ట్రంలోని బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. అధికార వైసిపి ప్రభుత్వం మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధనే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ఉద్యమాన్ని మరింతగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బంద్‌ జరగకుండా కొన్ని ప్రాంతాల్లో విద్యార్థి, యువజన సంఘాల నాయకులను గృహా నిర్బాంధానికి గురిచేయడం సరికాదన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కె.భాను ప్రసాద్‌, దినేష్‌, శ్రీను, భాను ప్రకాష్‌, మహర్షి,.విజరు కుమార్‌ రెడ్డి, కె.శ్రీనివాస్‌, స్టాలిన్‌, భాస్కర్‌ పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్‌ జరిగింది. కెజి నుంచి పిజి వరకూ ఉన్న విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు బంద్‌లో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు గణేష్‌, అశోక్‌, వెంకటేష్‌ నాయకత్వం వహించారు.