Nov 21,2023 22:55

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా మేఘాలు కమ్మేశాయి. ఉదయం నుంచి చిరుజల్లులతో ప్రారంభం అయిన వర్షం అక్కడక్కడా తేలికపాటిగా వర్షం పడింది. అల్పపీడన ప్రభావం మరో రెండు మూడు రోజులపాటు ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు గుండెల్లో గుబులు రేగుతోంది. గత రబీ సాగును తుఫాను నట్టేట ముంచిన విషయాన్ని రైతులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కోతలు కోసి పనలపై ఉన్న దశలోనే అన్నదాతలకు అపార నష్టం తెచ్చిపెట్టింది. ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ రిస్థితి నెలకున్నప్పటికీ కోతల సమయంలో వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఈ ఏడాది ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుందనే సంతోషంతో ఉన్నారు. ఈ సీజన్‌లో 4.3 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోందని అధికారుల అంచనా వేశారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా సుమారు 60 శాతం కోతలు పూర్తయ్యాయి. 2.50 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యం తీసుకోగా 232 ఆర్‌బికేలలో ఇప్పటి వరకూ 35 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు జరిగినట్లు అధికారిక గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 60 శాతం కోతలు పూర్తియితే సుమారు 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అయినట్లు అంచనా. ప్రస్తుతానికి ఆర్‌బికేల ద్వారా కేవల 35 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యంను మాత్రమే కొనుగు చేశారు. ఇంకా సుమారు 1.47 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కళ్లాల్లోనే ఉన్నట్లు అనధికార అంచనా. ఇందులో దళారులు, ఇతర ప్రయివేటు వ్యాపారులు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసేశారని అనుకున్నా నేటికీ కళ్లాల్లో సుమారు 47 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నట్లు పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవాలు ఇలావుంటే ప్రస్తుతానికి కళ్లాల్లో ధాన్యం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన అల్పపీడనం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం రోడ్లపై ఆరబోసిన ధాన్యంను కాపాడుకునేందుకు రైతులు నానావస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం రోడ్లపై ధాన్యంను ఆరబోసేందుకు టార్పాలిన్లను 50 శాతం రాయితీపై అమ్మకం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ సౌకర్యానికి పూర్తిగా మంగళం పాడింది. దీంతో రైతులు ప్రయివేటు వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేసేందుకు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. లేదంటే అద్దె ప్రాతిపదికన టార్పాలిన్లను తెచ్చుకుని ధాన్యంను కాపాడు కుంటున్నారు. అల్పపీడన ప్రభావంతో రోడ్లపై ఉన్న ధాన్యంను కాపాడుకునేందుకు రైతులు పాకులాడుతుంటే, మరోపక్క దళారులు ఇదే అవకాశంగా దోచుకుపోయేందుకు ప్రయత్నాలు ప్రారం భించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది డిమాండ్‌ ఉండటంతో మద్దతు ధరకు రూ.200 తేడాతో కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం కామన్‌ వెరైటీ క్వింటాల్‌కు రూ. 1637 ఇవ్వాలి. కొవ్వూరులో 75 కిలోల బస్తా ధాన్యాన్ని రూ.1450 నుంచి 1500 చొప్పున గోపాలపురం నియోజకవర్గంలో రూ.1400, కడియంలో రూ.1500 చొప్పున కొనుగోళ్లు జరిగాయి. కొనుగోలు కేంద్రాల వద్ద 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలుకు నిబంధనలకు అడ్డుగోడలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దళారులు రైతులను ముగ్గులోకి దింపి తక్కువ ధరకే ధాన్యంను ఎత్తుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్పపీడనం ఒకటి, రెండు రోజులపాటు కొనసాగితే రైతుల్లో మరింతగా ఆందోళన తప్పదు.