
ప్రజాశక్తి-శృంగవరపుకోట : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముసుగులు వేసి టిడిపి, జనసేన దొంగలు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ముసుగులు వేసుకుని మళ్లీ మోసం చేయడానికి వస్తే ఊరుకుంటారా? అని ప్రజల్ని ప్రశ్నించారు. వైసిపి చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర శనివారం శృంగవరపుకోట పట్టణానికి చేరుకుంది. తొలుత బస్సుయాత్రలో భాగంగా జామి మండలం అలమండలోని జగనన్న కాలనీలో లబ్ధిదారుడు నిర్మించుకున్న ఇంటిని మంత్రి బొత్స ప్రారంభించారు. స్థానికంగా ఉన్న సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం శృంగవరపుకోటలో దేవి గుడి కూడలిలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది వైసిపి ప్రభుత్వమేనని తెలిపారు. వెనుకబడిన తరగతులకు సామాజిక, రాజకీయ సాధికారతను సిఎం జగన్ ఇచ్చిచూపారన్నారు. ఎన్నికల్లో ఏం చెప్పామో, పాలనలో ఏం చేశామో ప్రజలకు చెప్పడానికే మీ ముందుకు వస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి, ప్రజలను నుంచి పారిపోయే పరిస్థితి తమకు లేదన్నారు.
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను, ప్రజలను మోసం చేశారన్నారు. ఆలీబాబా దొంగల తరహాలో కేబినెట్ ఏర్పాటు చేసి దోచుకున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు వేసి ప్రతీ పనికి లంచాలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. వృద్ధులు నెలకు మూడు వేల రూపాయల పింఛను తీసుకునే రోజు దగ్గరలోనే ఉందని ప్రకటించారు. ఎస్.కోట గడ్డ.. వైసిపి అడ్డా అని ఎమ్మెల్సీ కుంబా రవిబాబు అన్నారు. సామాజిక సాధికారతను వైసిపి సాధించిందో, లేదో చెప్పడానికి సభకు వచ్చిన జనమే నిదర్శనమని ఉద్ఘాటించారు.
ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ అవినీతి చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబుకు సానుభూతి కావాలని టిడిపి నేతలు బస్సుయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో టిడిపి కేబినెట్ మంత్రి పదవులు విజయనగరం, బొబ్బిలి రాజుల కుటుంబాలకే ఇస్తారని, జగన్ సామాజిక న్యాయం పాటించి కేటాయించారని వివరించారు.
కార్యక్రమంలో వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు, జిసిసి చైర్‌పర్సన్ శోభా స్వాతీరాణి, తదితరులు పాల్గొన్నారు.