
'అబ్బబ్బబ్బా! మీకెన్నిసార్లు చెప్పాలండీ! చుక్కకూర తెమ్మంటే బచ్చలకూర తెస్తారు. బచ్చలికూర తెమ్మంటే చుక్కకూరని మోసుకొస్తారు. మీరు ఎన్నిసార్లు రైతు బజారుకి వెళ్తున్నా.. ఒక్కనాడూ నేను చెప్పిన ఆకుకూరలు సరిగ్గా తెచ్చి తగలడరు కదా?' చిరాగ్గా చేతిలో ఉన్న ఆకుకూరల కట్టను విసిరేస్తూ, రుసరుసలాడుతూ వంటగదిలో నుండి విసురుగా వచ్చింది, భార్యామణి వర్థనం.
వార్తా పత్రికల పేరుతో ముద్రించే 10 పేజీల వాణిజ్య ప్రకటనల కరపత్రికా దినపత్రికను తిరగేస్తూ, అలవాటుగానే అన్నాను 'చూడు వర్థనం! ఒక్క ముక్కలో చెప్తున్నా మళ్లీ విను! నాకు చుక్కకూరకీ, బచ్చలికూరకీ తేడా తెలియదని నీకు లక్షసార్లు చెప్పాను. పోనీ ఇద్దరం కలిసి, అలా బండి మీద సరదాగా, షికారుకి వెళ్లినట్లూ ఉంటుంది. బజారుపనీ చేసినట్లూ ఉంటుంది వెళ్దామని అంటే నీవు ససేమిరా రావాయె! మరెట్లా?'
'ఆ ఆ..నా ముఖానికి అదొక్కటే తక్కువైంది?' విసుక్కుంది వర్థనం.
'వర్థనం! ఎందుకూ అంత కోపం? కోపంలో కూడా నువ్వు ఎంత అందంగా ఉన్నావో? చూడూ..! అయినా మనసుండాలే గానీ సరదాలకూ, సంతోషాలకూ వయసుతో పనేముంది చెప్పు?' ఆమె నుదుటిపై మెరుస్తున్న సింధూరాన్ని చూచి, పద్మమేమోనని భ్రమించి, భ్రమరంలా ఎగురుతున్న ముంగురులను సవరిస్తూ సముదాయించబోయాను!
'చాలు చాల్లెండి సంబడం! ఈ సరసాలకేమీ తక్కువ లేదు. అయినా మీరు రైతు బజారుకి వెళ్లినా అక్కడ ఏ దిక్కుమాలిన వాడినో చూస్తారు. కరిగి కన్నీరు మున్నీరై అసలు విషయం మరిచేపోతారు. ఏ కూరగాయలు ఎలా ఎంచాలో, ఎలా పోల్చుకోవాలో తెలిసి ఛస్తే గదా? మీకు తెలిసిందల్లా అందరి సమస్యలూ నెత్తిన వేసుకోవడం! పైగా కమ్యూనిస్టు భావజాలమని సమానత్వం- సమసమాజమని ఊకదంపుడు ఉపన్యాసాలొకటి! అసలు నాకు తెలియక అడుగుతాను. మన చేతికున్న ఐదువేళ్లే ఒకేలా సమానంగా ఉండవు కదా? ఇంక సమాజంలో ఆ.. సమానత్వం ఎక్కడొస్తుందీ, నా బొంద?! అయినా మిమ్మల్ని అని ఏం లాభం! మిమ్మల్ని ఇలా తయారుచేసిన అదిగో ఆ అత్తగార్ని అనాలి!'
చనిపోయిన మా అమ్మ ఫొటోని చూపిస్తూ దెప్పి పొడిచింది.
'చూడు వర్థనం! నన్ను ఏమైనా అన్నా ఫర్వాలేదు. మా అమ్మని ఆడిపోసుకున్నా నేనేం అనను. కానీ మచ్చలేని మా భావాలను విమర్శిస్తే ఊరుకోను. నీవనుకుంటున్నట్లు సమానత్వమంటే చేతికున్న ఐదువేళ్లూ ఒకేలా ఉండడంకాదే పిచ్చిదానా? వేర్వేరుగా ఉన్నా, అన్ని వేళ్లనూ సమానస్థాయిలో గౌరవించడం! అలాగే ఈ సమాజంలో ఉన్న అన్ని తరగతుల వాళ్లూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే సమసమాజ నిర్మాణం!' కాస్త గట్టిగానే జవాబిచ్చాను.
'సర్లెండి! అన్నట్లు అమ్మాయికి ఈ రోజు హాస్పిటల్లో డ్యూటీ నైట్‌షిఫ్ట్ అంట! అందుకని కాస్సేపు నిద్ర పోనీయండి! మీరు రంకెలేసి, కేకలేసి, నాకు బీపి తెప్పించకండి! ఆ..అదిగో..ఆ..డైనింగ్ టేబుల్ మీద వేడి వేడి కాఫీ ఉంచాను! సేవించి, తమరు స్నానానికి దయచేయండి!' అంటూ హుకుం జారీ చేసి మరీ వంటగదిలోకి జారుకుంది.
నేను వేడి వేడి కాఫీ తాగి, కరపత్రాల దినపత్రికను మరోమారు తిరగేసి, వాష్‌రూం వైపు దౌడు తీశాను!
***
'వర్థనం! నేనలా రైతుబజారుకి వెళ్లి వస్తాను' అని సంచి భుజాన తగిలించుకొని, బయలుదేరాను. కిక్కిరిసిన జనంతో రైతుబజారు తీర్థంలా ఉంది. జనం హడావుడి చూసి, దుకాణదారులు వారికి నచ్చినవీ, పుచ్చినవీ గాబరాగా వేసేస్తుంటే అంతే కంగారుతో ఒకర్నొకరు తోసుకుంటూ ఇంక రేపో మాపో ఆ రైతుబజార్లు ఉండవేమోనన్నట్లు అందరూ కలబడిపోతున్నారు. నిలబడి అలా చూస్తున్న నా దృష్టి ఇంకోవైపు మళ్లింది.
ఆ జనం మధ్యలో ఒకడు చిరిగిన దుస్తుల్తో, చింపిరి జుట్టుతో, మాసిన గెడ్డంతో, మలినమైన దేహంతో- విరిగిన రెండు కాళ్లతో దేక్కుంటూ అడుక్కుంటున్నాడు.
'అమ్మా! ఆకలి! అయ్యా! ఆకలి! బాబ్బాబూ! అన్నం తిని రెండు దినాలైనాది. తమకు తోచిన ధర్మం సేయండి బాబూ!' అతి దీనంగా యాచిస్తున్న వాడిని చూసి, కాస్త చలించిపోయాను. వాడివైపే తదేకంగా చూస్తూ, కూరలేవో కొని, తోచిన ఆకుకూరలు కూడా సంచిలో కుక్కేసుకొని, జనాలందరితో పాటు భౌతికదూరాన్ని దూరంగా నెట్టి, తెలియని ఆతృత ఏదో నామదిని తట్టగా, తట్టుకోలేక ఆ బిచ్చగాడు కూర్చున్న వైపుగా అడుగులు వేశాను.
'ఒరేరు కాశీ! పిల్లలు లేకపోతే, కాశీకి వెళ్లి మొక్కు తీర్చుకుంటే నువ్వు పుట్టావురా! అందుకే నీకు 'కాశీ విశ్వనాథం' అని పేరు పెట్టుకున్నాం! కాశీ! అన్ని దానాల్లోకీ అన్నదానం చాలా గొప్పదిరా! కాశీకి వెళ్లి, అక్కడి బీదసాదలకు
అన్నదానం చేయగానే వెంటనే మా కడుపు పండిందిరా! ఒరేరు కాశీ! బతికినన్నాళ్లూ అన్నార్తుల ఆకలి తీరుస్తూ, పదిమందికీ సహాయపడితేనే మన జన్మకు సార్థకతరా!!' చనిపోయిన అమ్మ మాటలు చెవుల్లో రింగుమంటుంటే రూ.50/-ల నోటు తీసి, ఆ బిచ్చవాని బొచ్చెలో వేశాను. ఆ పూటకి అన్నం తినమని.
ఇంటి ముఖం పట్టాను. షరా మామూలే ఇంట్లో బచ్చలికూర, చుక్కకూర అంటూ శ్రీమతి గోల! ఈ సారి మా శ్రీమతి మాటలకు నేనేమీ చలించలేదు.
నా ఆలోచనలన్నీ ఆ బిచ్చగాడి చుట్టూనే తిరుగుతున్నాయి. రాత్రంతా కూడా వాడి గురించే నా ఆలోచన! అలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఎప్పుడు రెప్పలు వాల్చేనో నాకే తెలియక నిద్రలోకి జారుకున్నాను!!
***
వారం గడిచింది. ఈసారి జగన్నాథóపురం బ్రిడ్జి దగ్గరికి బయలుదేరాను. ఆకుకూరలకు అక్కడి మార్కెట్ ప్రసిద్ధి అని ఎవరో చెప్పగా, అక్కడికి వెళ్లాను. ఆశ్చర్యం! అక్కడి మార్కెట్ వద్ద, ఆకుకూరల మాటేమోగానీ నాకు అదే బిచ్చగాడు అక్కడా కనిపించాడు. యథాలాపంగానే యాచిస్తున్నాడు. 'అరే! వీడికి రెండు కాళ్లు విరిగిపోయాయి కదా, ఇంత దూరం ఎలా రాగలిగాడు?' (??) నా మదిలో ప్రశ్నల వర్షం! అక్కడ ఓ కిళ్లీ బడ్డీ వాడిని అడిగాను.
'ఈ బిచ్చగాడు ప్రతిరోజూ ఇక్కడే ఉంటాడా?' అని.. దానికి వాడు 'లేద్సార్! అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తాడు!' అని బదులిచ్చాడు.
భోజనం చేయమని మళ్లీ రూ.50/- ఇచ్చి, కావలసిన కూరల్ని తెచ్చి,
భార్యామణి చీవాట్లతో పొద్దుపుచ్చి. ఈ సారీ బచ్చలకూరకీ, చుక్కకూరకీ తేడా తెలుసుకోలేక పోయినందుకు కించిత్తు నొచ్చుకున్నాను!
***
'అది 1929లో బ్రిటిష్ వాళ్లు కట్టించిన మార్కెట్ యార్డు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన మార్కెట్ ఒకప్పుడు! ఇప్పటికీ ఇక్కడ దొరకని వస్తువంటూ ఏదీ ఉండదు' అక్కడే షాపు నడుపుతున్న మా బట్టలు కుట్టే టైలరు సత్తిబాబు చెప్పగా, ఈ సారి సదరు మార్కెట్ యార్డుకి ప్రయాణమయ్యాను. (ఈసారి కచ్చితంగా చుక్కకూరని పోల్చి, తేవాలనే దృఢ సంకల్పంతో)
ఆశ్చర్యం! మా ఇంటి నుండి ఆరు కి.మీ దూరంలో ఉన్న ఆ మార్కెట్ ముందర అదే బిచ్చగాడు తిరిగి కనిపించాడు.
'అరే! కాళ్లున్న నేనే ఎక్కడికీ వెళ్లలేకున్నాను. అవిటివాడైన వీడు ఇంతింత దూరం ఎలా రాగలుగుతున్నాడో?' లాభం లేదు, ఈ సారి స్వయంగా వాడినే విషయం అడుగుదామని వడి వడిగా వాడి వైపు అడుగులేశాను.
'నీ పేరేమిటి?' అడిగాను. 'రంగడండీ' చెప్పాడు బిచ్చగాడు.
'అవునూ! నీకు రెండు కాళ్లూ లేవు కదా! ఇంతింత దూరం నువ్వు ఎలా రాగలుగుతున్నావు?' నా సందేహాన్ని వెలిబుచ్చాను.
'నానేం రావడం నేదు బాబూ! నన్ను కొనుక్కున్న దొర, బండి మీద ఒట్టుకొచ్చి, ఇలా అన్నిచోట్లకూ తిప్పి, తిప్పి పెతిరోజూ అడుక్కోమంటాడు. పొద్దుగుంకేక సొమ్మంతా ఆరికి ఇచ్చేయాల!' అంటూ ఓ ప్లాస్టిక్ కవర్లో, ఎవరో పడేసిన అన్నాన్ని ఆబగా అందుకొని, తినబోతున్నాడు'.
'అదేమిటీ? మేం వేసిన డబ్బులు నువ్వు తీసుకోవా?' అడిగాను.
'నేదండీ! సందేలకి లెక్క సెప్పి, ఒప్పసెప్పేయాల. మీలాంటోల్లు ఎట్టిన వొన్నం నాను తినాల!' చెప్పుకుపోతున్నాడు.
ఒక్కసారి నా కళ్లు గిర్రున తిరగసాగాయి. ఈసారి వీడికి డబ్బులు కాకుండా తినడానికి ఏదైనా ఇవ్వాలని అనుకుంటూ, దగ్గర్లో ఉన్న పార్లర్ లోనికెళ్లి, టిఫిన్ ప్యాక్ చేయించి ఇచ్చాను. వాడందుకొని తృప్తిగా తింటుంటే, ఆనందంతో ఇంటి ముఖం పట్టాను.
చుక్కకూరకి బదులు ఈసారి పాలకూర పట్టుకెళ్లినందుకు, మా శ్రీమతి తిట్ల దండకానికి కిక్కురుమనక రంగడి ఆనందాన్ని లెక్కలు వేస్తూ, ఆ రోజు అలా నేనూ ఆనందంగానే గడిపాను!!
***
'ఓహో ఇదో రకం వ్యాపారం కాబోలు! ఇటువంటి బిచ్చగాళ్లనే పెట్టుబడి పెట్టి, సాగిస్తున్న వ్యాపారం అన్నమాట!' అనుకుంటూ ఎప్పటిలాగే ఇంటి దగ్గరి రైతుబజార్‌కే మళ్లీ వెళ్లాను.
నా చూపులన్నీ ఆ రంగడి కోసమే వెదుకుతున్నాయి. ఆకుకూరల మాట ఎలా ఉన్నా 'ఏమోరు ఇక్కడ రెండు కాళ్లూ లేని అవిటివాడొకడు కూర్చొనే వాడు కదా! ఈ రోజు రాలేదా?' దగ్గర్లో ఉన్న సెలూన్ షాపు వాడిని అడిగాను.
'లేదు సార్! ఈ రోజు రాలేదు. బహుశా ఇంకో సెంటర్లో ఉండి ఉంటాడు' జవాబిచ్చాడు సెలూన్ వాడు.
వెంటనే బైక్ స్టార్ట్ చేసి, జగన్నాథపురం వైపు వెళ్లాను. అక్కడా లేడు. మరు నిమిషంలో బ్రిటిష్ మార్కెట్‌యార్డుకి వెళ్లి చూశాను. అక్కడా లేడు. ఏమై ఉంటాడోనని కంగారుపడుతూ, టైలరు సత్తిబాబుని అడిగాను.
'ఏమో సార్! ఈ మధ్య వారం రోజుల నుండి కనిపించడం లేదు. వాడిని తోలుకొచ్చే ఆ రాయుడు కూడా రావడం లేదు' చెప్పాడు.
'రాయుడా? రాయుడెవరు?' అడిగాను.
'అదే సార్! ఆ రాయుడే ఈ బిచ్చగాడ్ని వేలంలో కొనుక్కున్నాడు. వీడి మీద వచ్చే రాబడితోనే ఆ రాయుడు వ్యాపారం చేస్తుంటాడు!' ముక్తసరిగా చెప్పాడు.
***
ఆదరా బాదరాగా అక్కడి మార్కెట్‌లో తోచిన ఆకుకూరలూ, కాయగూరలూ కొనేసి, రంగడు ఎందుకు కనిపించలేదనే గాబరాతో బయలుదేరాను. దారిలో మసీదు సెంటర్ వద్ద రంగడు కనిపించాడు. బైక్‌ని పార్కు చేసి, వెంటనే ఆనందంతో అడుగులు వేస్తూ, పడుకొని ఉన్న రంగడి దగ్గరగా వెళ్లి చూశాను.
'అమ్మా! ఆకలి!! బాబ్బాబూ!' అనే కేకలు వినబడడం లేదు. జాలి చూపులూ అగుపడలేదు. అచేతనంగా పడి వున్న రంగడి శరీరంపై ముసురుతున్న ఈగల రొద నా మదిని కలచివేసింది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా, ఎవరి గోల వారిదన్నట్లున్నారు.
ఉండ బట్టలేక, ఆ పక్కనే పుట్‌పాత్ మీద కూర్చొని, గొడుగులు బాగుచేసే వాడిని 'ఏమైంది?' అని అడిగాను!
అతను ఇలా చెప్పడం ఆరంభించాడు. 'బాబూ! నా పేరు రహీమ్! నేను ఈ మసీదు సెంటర్లోనే 30 ఏళ్లుగా గొడుగులు బాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. వీడు రంగడు బాబూ! వీడి సారు రాయుడు. రాయుడుగారే వీడిని కొనుక్కున్నాడు. వీడిని రోజుకో పాయింటు దగ్గర కూర్చోబెట్టి, అడుక్కోమంటాడు. ఆ వచ్చిన సొమ్మంతా సాయంకాలానికల్లా ఆ రాయుడే వచ్చి, పట్టుకెళ్లిపోతాడు. వీడికి మురిగిపోయిన అన్నం గానీ, బిర్యానీ గానీ పడేసిపోతాడు. దానితోనే వీడు ఆకలి తీర్చుకుంటాడు. ఈ మధ్య ఆ రాయుడే అమ్ముడైపోనాడంట!'
'రాయుడిని అమ్మేశారా? రాయుడిని అమ్మేయడమేమిటీ?' అర్థంకాక ఆశ్చర్యంగా అడిగాను.
'ఎవరో 'సింగానీ అండ్ సాంబ్రాణీ బ్రదర్స్' అంట! ఆ రాయుడి వ్యాపారం మూడు పువ్వులూ, ఆరుకాయలుగా ఉందని తెలిసి, కొనేసుకున్నారు. వాళ్ల మనిషి ఎవరో వచ్చి, ఈ రంగడి రోజువారీ సంపాదనంతా పట్టుకొని పోతున్నాడు. ఆ రాయుడైతే వీడికి తినడానికైనా ఏదో ఒకటి ఇచ్చేవాడు. ఇప్పుడదీ లేదు. తిండీ తిప్పలు లేక ఆకలితో చచ్చిపోయాడు బాబూ!' ఇంకా చెప్పుకుపోతున్నాడు రహీమ్.
అంతా అర్థమైంది.
'ముష్టి వ్యాపారాన్ని మించిన 'ముదనష్టపు వ్యాపారం' అన్నమాట ఇది. ప్రభుత్వ ఆస్తులే కాక ఇలా ముష్టి సామ్రాజ్యాల్నీ దోచేసుకుంటున్నారన్న మాట!
చేసేది లేక రంగడి తల దగ్గర ఒక రూ.100/-లు పెట్టి, అశృనయనాలతో ఇంటి ముఖం పట్టాలా లేక అన్నమో బిర్యానీ గానీ కొని ఇవ్వాలో తెలియక ఆలోచిస్తూ, స్థాణువునై అలా నిలబడిపోయాను. ఇంతలో కొంతమంది జనం చుట్టూ గుమిగూడారు.
***
సరిగ్గా అదే సమయంలో ఎంబిబిఎస్ పూర్తిచేసి, గవర్నమెంటు హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ (హౌస్ సర్జన్) చేస్తున్న మా అమ్మాయి, అటుగా వస్తూ, నన్ను చూసి, 'నాన్నా! మీరా? ఇక్కడ ఏం చేస్తున్నారు?' ఆశ్చర్యంగా అడిగింది.
విషయమంతా మా అమ్మాయితో చెప్పాను. 'అరే! ఇతను చనిపోలేదు నాన్నా! ఇంకా ఊపిరి ఆడుతోంది' దగ్గరగా వెళ్లి, చెక్ చేసి చెప్పింది.
'ఇతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి, ట్రీట్‌మెంట్ ఇప్పిస్తే, బతుకుతాడు' అంటూ ఎవరికో ఫోన్ చేసి, క్షణాల్లో అంబులెన్స్ రప్పించి, రంగడిని ఎక్కిస్తూ, 'నేను ఇతన్ని మా హాస్పిటల్‌లో జాయిన్ చేసి వస్తాను. మీరు ఇంటికి వెళ్లండి' అంటూ 'కోలుకున్నాక ఏదైనా అనాధ శరణాలయంలో చేర్పిద్దాం!' అంది.
'అమ్మా! వీటికి అయ్యే ఖర్చూ, డబ్బూ..' చెప్పబోతున్నంతలో నా మాటలకు అడ్డు తగులుతూ.. 'నాన్నా! నా మొదటి నెల స్టైఫండ్ ఈరోజే అందుకున్నాను. ఖర్చు సంగతి నేను చూసుకుంటాను' అని భరోసా ఇచ్చింది.
'అదికాదమ్మా! నీ మొదటి సంపాదనతో అమ్మకి వాషింగ్‌మెషీన్ కొంటానని మాట ఇచ్చావు. అమ్మ ఏమనుకుంటుందోనని..' నసిగాను.
'నాన్నా! అమ్మ సంగతి మీకు తెలియదా? తన మాట కటువైనా మనసు సున్నితం. నేను చేసే ఈ సహాయానికి నన్ను అభినందించే మొట్టమొదటి వ్యక్తి అమ్మే కద నాన్నా! ఒక మనిషి ప్రాణం నిలబెట్టడం కన్నా సాయం ఏముంటుంది నాన్నా? అలా చేస్తేనే కదా మేం చదివిన చదువుకి సార్థకత! మా మనసుకి సంతృప్తి! సరే నాన్నా! మీరు బయలుదేరండి, అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది' ధైర్యంగా బండి స్టార్ట్ చేసి, రంగడి అంబులెన్స్ వెనుక బయలుదేరింది.
తన ఔన్నత్యానికి పొంగిపోతూ.. నేనూ గంభీరంగా బైక్ స్టార్ట్ చేశాను.
***
'ఏమండీ! ఎన్నాళ్లకి మీరు చుక్కకూర తెచ్చారండీ! భలేగా పోల్చుకున్నారు ఇన్నాళ్లకి!' ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోయే శ్రీమతికి ఏం చెప్పాలో తెలియలేదు.
'పిచ్చిదానా! నేను ఇప్పుడు బచ్చలికూర అని అడిగితే వాడు ఏదో కూర నా చేతిలో పెట్టాడు. నా అదృష్టం బాగుండి అది చుక్కకూర అయ్యింది. నిజానికి నాకు ఇప్పటికీ బచ్చలికూరకీ, చుక్కకూరకీ తేడా తెలియదు. ముష్టి వ్యాపారానికీ - 'ముదనష్టపు వ్యాపారానికీ తేడా తెలవనట్లే!' మనసులో అనుకున్నాను. మమతల మాధుర్యాన్ని కురిపిస్తూ.. మానవతా భూషణమై శోభిస్తూ.. రంగడి ప్రాణాలను కాపాడబోతున్న మా అమ్మాయి లక్ష్య సాధనకు మురిసి పోతూ.. కనుల వెంట జాలువారుతున్న ఆనంద భాష్పాలను మురిపెంగా తుడుచుకుంటూ..!
(అంకితం: ఆత్మీయ మిత్రుడు శ్రీ పిల్లల గోపాలరావుకి అభివాదములతో..)
నాగభూషణ్ పాఢ
86887 78228