Sep 17,2023 22:21

ముస్తాబైన తిరుమల క్షేత్రం
18న పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం
బ్రహ్మోత్సవాలకు టిటిడి భద్రతా ఏర్పాట్లు పూర్తి

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం ముస్తాబైంది. సెప్టెంబర్‌ 18 సోమవారం నుంచి 26వ తేదీ వరకు నిర్వహించేందుకు టీటీడీ భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్షేన స్వామికి విశేష సమర్పణ కావిస్తారు. అనంతరం తిరుచ్చిపై రాత్రి 7గంటలకు మాడవీధుల్లో ఊరేగిస్తారు. పడమర మాడ వీధిలోని నైరుతిమూలలో ఉన్న వసంత మండపానికి తీసుకొచ్చి శాస్త్రోక్త కార్యక్రమాల మధ్య పుట్టమన్నును సేకరిస్తారు. నవపాలికలలో భద్రపరుచుకుని ఊరేగింపు పూర్తయ్యాక ఆలయ యాగశాలకు వేంచేస్తారు. అక్కడ అర్చకస్వాములు ఆగమోక్తంగా కైంకర్యాలు నిర్వహించి అంకురార్పణ (బీజవాపం) కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు మొదలవుతాయి. సోమవారం సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీన లగంలో ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి పెద్దశేష వాహన సేవతో బ్రహ్మౌత్సవాల వాహనసేవలు ప్రారంభంకానున్నాయి.
18న ధ్వజారోహణం
సెప్టెంబర్‌ 18న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.
స్వామిసేవకు 52 మంది అర్చకులు
ఇకపోతే ఈ బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా గొల్లపల్లి కుటుంబానికి చెందిన రామకష్ణ దీక్షితులు వ్యవహరించనున్నారు. అంకురార్పణ నుంచి చక్రస్నానం వరకు వాహనసేవల్లో, యాగశాలలోని వైదిక కార్యక్రమాలు, ఇతర పూజల్లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారు. ఉదయం, సాయంత్రం మడిని పాటిస్తూ నిత్యహోమాలు, ఇతర వైదిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు పొలిమేర దాటివెళ్లరు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలను ఆగమోక్తంగా నిర్వహిస్తామని శ్రీవారి ఆలయ ప్రధానఅర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడించారు. వాహనసేవలతో పాటు యాగశాల, గర్భాలయం వంటి ప్రాంతాల్లో కైంకర్యాల కోసం మొత్తం 52 మంది అర్చకులు ఉన్నారన్నారు. వీరితోపాటు వాహనసేవల్లో కొలువుదీరే ఉత్సవమూర్తులను అలంకరించేందుకు చెన్నై నుంచి ప్రత్యేకంగా మరో ఇద్దరు అలంకరణ భట్టాచార్యులు వచ్చారని తెలిపారు. లోకకల్యాణం కోసం స్వామి మాడవీధుల్లో విహరిస్తారని... అయితే వాహనసేవలపై నాణేలు విసరడం శాస్త్ర విరుద్ధమని భక్తులు అంతా ఈ విషయాన్ని గ్రహించాలని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు సూచించారు..