Apr 22,2023 00:56
ముస్లిములకు శుభాకాంక్షలు తెలుపుతున్న సిపిఎం రాష్ట్ర నాయకురాలు డి రమాదేవి

ప్రజాశక్తి-రేపల్లె: రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిములకు ప్రముఖ వ్యాపారవేత్త మోపిదేవి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిములకు భారీఎత్తున ఇఫ్తార్‌ విందును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిములతో కలిసి పవిత్ర రంజాన్‌ సందర్భంగా ఇఫ్తార్‌ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముస్లిములు అందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి, జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య, నాయకుడు సిహెచ్‌ మణిలాల్‌, సర్పంచి ముత్తిరెడ్డి జయరామయ్య, ముస్లిం మతపెద్దలు, ముస్లిం ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పిట్టలవానిపాలెం: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు చందోలు గ్రామంలో ఆ గ్రామ టీడీపీ నాయకులు నిజాం ఆధ్వర్యంలో శుక్రవారం తోఫా అందజేశారు. ఈ సందర్భంగా నిజాం మాట్లాడుతూ వ్యాపారాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నా తృప్తి కలగక ప్రజా సేవ చేయాలని దృఢ సంకల్పంతో గ్రామంలో ఉంటూ సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నట్లు తెలిపారు. రంజాన్‌ పండుగను పురస్కరించుకుని సేవ కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు. గతంలో ఎందరికో ఉచిత విద్యను అందించిన తన తండ్రి ఆశయాలను తాను పుణికిపుచ్చుకున్నట్లు తెలిపారు. గన్‌ పంతులుగా పిలవబడే తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పేదలకు సాయం చేయాలని ఒక ప్రణాళిక రూపొందించుకున్నానని అన్నారు. దీనిలో భాగంగానే ఇఫ్తార్‌ విందు రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులను చందోలు గ్రామానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వారు ఇచ్చిన అమూల్య సలహాలు, సహాయంతో తన సోదరుల సహకారంతో సుమారు 400 మందికి తోఫా అందిస్తున్నానని అన్నారు. తన అభిమాన నాయకుడు చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గ్రామంలోని నాయకులను కలుపుకుంటూ గ్రామ సమస్యలపై దృష్టి సారించి తన పరిధిలో సమస్యలను పరిష్కరిస్తానన్నారు. పారదర్శక రాజకీయాలు చేసి పేదవాని అభివృద్ధికి సాయం చేయటమే తన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఖాసీం, మీరా తదితరులు పాల్గొన్నారు.