ప్రజాశక్తి-విజయనగరం కోట : మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని గురువారం నగరంలో ముస్లిములు భారీ ర్యాలీ నిర్వహించారు. మిలాద్ ఉన్‌నబీ సందర్భంగా మహ్మద్ ప్రవక్త జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వేలాది మంది ముస్లిములు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. సహనం, శాంతి, సామరస్యం, ఐక్యతల సందేశాన్ని ప్రపంచానికి బోధించారు. మహమ్మద్ ప్రవక్త జీవితం అత్యంత పవిత్రమైనదని, సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షులు కరీమ్ కెపిసిసి మైనార్టీ వైస్ చైర్మన్ ఎమ్‌డి హుస్సేన్ షరీఫ్, మహమ్మద్ ముస్తఫా, అన్వర్ ఖాన్, ఎమ్‌డి యూనూస్, ఇక్బాల్, అన్సారీ, శీరత్‌కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి కషి : కోలగట్ల
విజయనగరం టౌన్ : ముస్లిం మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తోందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం, మైనార్టీల ఆధ్వర్యంలో గురువారం నగరంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు చేపట్టిన సంఘీభావ యాత్రలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి పండగనూ కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల వలె జరుపుకోవడం విజయనగరం ప్రజల ప్రత్యేకత అన్నారు. ముసిములకు తాము ఎప్పుడూ అండదండగా ఉంటామని చెప్పారు. అనంతరం ఊరేగింపులో పాల్గొన్న వారికి చల్లని పానీయాలు, ఖర్జూరాన్ని కోలగట్ల పంపిణీ చేశారు.










