Mar 05,2022 06:59

మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపరమైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకుంటే, వారిలో కొంతమంది గొంతెత్తి, రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించుకోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతులైన ముస్లిం యువతులు హిజాబ్‌ (తలకు ముసుగు/హెడ్‌ స్కార్ఫ్‌) ధరించడం ద్వారా వారికున్న హక్కును మితవాదులకు స్పష్టంగా చెప్పదలచుకున్నారు.

     భారతదేశంలో...హిందూ మహిళల్లో కుల, మత, వర్గ బేధాలు ఉన్నట్లే...ముస్లింల మధ్య కూడా విభజనలు ఉన్నాయి. కానీ నేడు ముస్లిం మహిళలందరిలో కాదనలేని ఒక ఉమ్మడి అంశమేమంటే, రాజకీయ చదరంగంలో సంఘ పరివార్‌ వారిని పావులుగా వాడుకుంటున్నది. 2019 లో బిజెపి ట్రిపుల్‌ తలాక్‌ ను నేరంగా పరిగణిస్తూ కొత్త చట్టం చేసిన నాటి నుండి ఇటీవల కాలంలో కర్ణాటక విద్యా సంస్థల్లోకి హిజాబ్‌ ధరించిన మహిళలను అనుమతించని వివాదం వరకు సంఘ పరివార్‌, ముస్లిం మహిళలను లక్ష్యం చేస్తూ వస్తున్నది.
     ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ తనను తాను ముస్లిం మహిళల రక్షకుడిగా చెప్పుకున్నారు. తాను, తన పార్టీ ముస్లిం పితృస్వామిక బంధనాల నుంచి ముస్లిం మహిళలను కాపాడుతున్నామని చెప్పారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లోని ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, కాలేజీలకు వెళ్లే దారిలో ముస్లిం బిడ్డలు వీధి రౌడీల అల్లరి చేష్టలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొనే వారనీ, కానీ తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా వారికి భద్రత ఏర్పడిందని చెప్పారు.
    చరిత్ర తెలిసిన వారు ముఖ్యంగా, 2002లో నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మితవాదుల మారణహోమానికి, దాడులకు గురైన మహిళలు ఆయన ప్రసంగాల్లో చెప్పిన విషయాలను విశ్వసించరు. దౌర్జన్యకారులు ప్రధానంగా ముస్లిం మహిళలను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడ్డారు. వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడి, వారి ఇళ్లను లూటీ చేసి, ధ్వంసం చేశారు. అహమ్మదాబాద్‌ లోని నరోదాపాటియా ఊచకోతలో గర్భవతి కౌసర్‌ బానూ షేక్‌ను మంటల్లో వేసి చంపారు. బతికి బయట పడ్డవారు, సాక్షులు ప్రాణాలను చేతబట్టుకొని సంవత్సరాల పాటు శరణార్థ శిబిరాల్లో గడిపారు. మత ప్రాతిపదికన సమీకరణలు మారడం ద్వారా ఆ దాడుల ప్రభావం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. 2002 తరువాత పుట్టిన తరానికి చెందిన ప్రజలకు ఇప్పుడు ఓటు హక్కు లభించింది. ఆ హింసకు సంబంధించి వీరికెవరికీ తెలియనప్పటికీ, దాని ప్రభావంతో ఇప్పటికీ బాధపడుతున్నారు.
     2014 తరువాత బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, మితవాద ప్రభుత్వం చేతిలో ఉన్న రాజ్యాంగ యంత్రాంగం, సంఘ పరివార్‌ శక్తులు ముస్లింలను భయకంపితులను చేస్తూ, నేరస్థులుగా పరిగణిస్తూ, నిర్బంధంలో ఉంచుతున్నారు. ముస్లిం పురుషుల జీవితాలు నాశనం కావడంతో, దాని కొనిసాగింపుగా వారి కుటుంబాలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో 2020 ఢిల్లీ అల్లర్లు, గోరక్షక దళాల పేరుతో చట్ట విరుద్ధంగా అనేక మందిని చంపారు. ముస్లింలకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు నిత్యకృత్యంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను అణచివేసి, విద్యార్థులు, కార్యకర్తలను మూకుమ్మడిగా అరెస్ట్‌ చేశారు. వారిలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు.
    మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపరమైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకుంటే, వారిలో కొంతమంది గొంతెత్తి, రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించుకోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతులైన ముస్లిం యువతులు హిజాబ్‌ (తలకు ముసుగు/హెడ్‌ స్కార్ఫ్‌) ధరించడం ద్వారా వారికున్న హక్కును మితవాదులకు స్పష్టంగా చెప్పదలచుకున్నారు.
 

                                                               దుర్మార్గపు 'సల్లీ ఒప్పందాలు'

జులై 2021లో ముస్లిం యువతులకు గుణపాఠం చెప్పే ఉద్దేశ్యంతో 'సల్లీ ఒప్పందాలు' (సల్లీ డీల్స్‌) పేరుతో 'గీత్‌ హబ్‌' వెబ్‌సైట్‌ వేదిక నుండి ట్విట్టర్‌ కు షేర్‌ చేశారు. 'వేలం కోసం' అని 80 మంది ముస్లిం మహిళల ఫోటోలను (మార్పు చేసిన) వారి ఇంటర్నెట్‌ నుండి తీసుకుని వారి అనుమతి లేకుండా పోస్ట్‌ చేశారు. వారిలో ముస్లిం జర్నలిస్ట్‌లు, ముస్లిం మహిళా కార్యకర్తలు, లాయర్లు, కళాకారులు వున్నారు. హానా మోహిసిన్‌ ఖాన్‌ అనే ఒక పైలట్‌ ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయడమేగాక, ఈ పిరికి పందలు చేసిన పనికి తగిన మూల్యం చెల్లించేట్లు చేస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఫాతిమా జోరా ఖాన్‌ అనే ముంబైకి చెందిన న్యాయవాది కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌ లో తన ఫోటో కూడా ఉన్న విషయం చూసి, వెన్నులో వణుకు మొదలైందని ఫాతిమా ఖాన్‌ అనే రిపోర్టర్‌ చెప్పారు. 'ఈ జాబితా తయారు చేసిన వారికి వేసే శిక్ష ఏమిటి? ముస్లిం పురుషులను చట్ట విరుద్ధంగా చంపుతున్నారు, ముస్లిం మహిళలను వేధిస్తున్నారు, ఆన్‌లైన్లో వేలం వేస్తున్నారు. ఇది ఎప్పటికి అంతమవుతుంది?' అని ఆమె ట్వీట్‌ చేశారు.
     'సల్లీ' అనేది ముస్లిం మహిళలను కించపరిచే ఒక అభ్యంతరకరమైన పదం. ''నేటి సల్లీ ఒప్పందం'' అని ప్రతీ రోజూ యాప్‌ లో ఒక ముస్లిం మహిళ ఫోటో పోస్ట్‌ చేసేవారు. ఈ యాప్‌ ను కేవలం ముస్లిం మహిళలను మానసికంగా వేధించే, కించపరిచే లక్ష్యంతోనే తయారు చేశారు. ద్వేషపూరిత రాజకీయ ప్రచారాన్ని ఖండిస్తూ మహిళా హక్కుల కార్యకర్తలు, సంబంధిత పౌరులు ఒక బహిరంగ లేఖ రాశారు. మితవాద హిందూత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో గొంతెత్తుతున్న ముస్లిం మహిళా జర్నలిస్టులు, వృత్తిదారులు, విద్యార్థులను లక్ష్యంగా చేసే కుట్ర అనీ, రాజకీయాల్లో వారి భాగస్వామ్యం లేకుండా చేయడం అసలు ఉద్దేశ్యమని పేర్కొన్నారు. తాము సమాన పౌరసత్వాన్ని, సమాన రాజకీయ భాగస్వామ్యాన్ని ఆన్‌లైన్లో, ఆఫ్‌లైన్లో ముస్లిం మహిళలకు చోటు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
   ఫిర్యాదుల అనంతరం గీత్‌ హబ్‌...ఆ యాప్‌ ను మూసేసింది కానీ, ఆరు నెలల తరువాత 'బుల్లీ బారు' పేరుతో పున:దర్శనం అయింది. ఈసారి ఆ యాప్‌ లో పాకిస్తాన్‌ నోబెల్‌ గ్రహీత మలాలా యూసఫ్‌ జారు, సినీ నటి షబానా ఆజ్మీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు సదాఫ్‌ జాఫర్‌, కాశ్మీరీ జర్నలిస్ట్‌ ఖురాతులైన్‌ రెహబర్‌, ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి భార్య, కనిపించకుండా పోయిన జె.ఎన్‌.యు విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ తల్లి ఫాతిమా నఫీస్‌ లతో పాటు మొత్తం 100 మంది ముస్లిం మహిళల పేర్లు ఉన్నాయి. జీవంలేని వస్తువులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ లో వేలం వేసే పద్ధతిలో మనుషులను వేలం వేసే పద్ధతిని నిషేధించాలని ఢిల్లీ హైకోర్టు విమిన్‌ లాయర్స్‌ ఫోరమ్‌ భారత ప్రధాన న్యాయమూర్తిని కోరింది. 'సల్లీ ఒప్పందాల' కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల నేరస్తులు స్వేచ్ఛగా ఆలోచించే, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే వారి చిత్రాలను ఉపయోగించుకుంటారు.
 

                                                                  హిజాబ్‌ సమస్య దుష్ఫలితాలు

ఆన్‌లైన్‌ వేలం కేసుల విషయంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నా, కర్ణాటక లోని పాఠశాలల్లో హిజాబ్‌ చుట్టూ నడుస్తున్న వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల్లోనే హిజాబ్‌ సమస్య, సుదూరంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా దాని ప్రభావాన్ని చూపింది. కానీ ముస్లిం ప్రజల్లో ఉన్న భిన్నత్వం వలన పదాల అర్థాలు భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు, బెంగాల్‌ ముస్లిం జనాభా ఎక్కువగా నివసించే ఢిల్లీ మురికివాడల్లో 'హిజాబ్‌' అనే పదం విదేశీ పదం. ఇళ్ళలో పని చేసే, నిర్మాణ రంగంలో పని చేసే మహిళలు ఒక్కోసారి ముసుగు ధరిస్తారు. దానిని వారు 'ఇస్కబ్‌' అంటారు. ఇంటిపని చేసే తబస్సుమ్‌, అక్కడే నివాసం ఉంటున్న ఆమె స్నేహితులు... దాన్ని చున్నీ, దుపట్టా, పర్దా లేక పల్లూ (చీర కట్టినప్పుడు) అంటారు. వారు బయటికి వెళ్ళినప్పుడు తలను కప్పుకుంటారు. కానీ పని చేసే సమయంలో, ఇంట్లో ఉన్నప్పుడు, సైకిల్‌ తొక్కే సమయంలో వివిధ సందర్భాలలో దానిని ధరించరు. దానితోపాటు పెళ్లి కాని అమ్మాయిలు కూడా వాటిని ధరించరు. పది సంవత్సరాల వయసు నుంచి తబస్సుమ్‌ ఇస్కబ్‌ ను ధరించడం వల్ల అది ఆమెకు బాగా అలవాటైపోయింది. ఒకవేళ ఆ ముసుగు లేకుంటే ఏదో కోల్పోయిన భావన కలుగుతుందని ఆమె చెప్పింది. కానీ ఆమె బుర్కా అలవాటు కాకూడదనే ఉద్దేశ్యంతో ఇంత వరకు బుర్కా ధరించలేదు. బుర్కా ధరిస్తే పని చెయ్యడం సాధ్యం కాదని, ఇంటి వద్దనే ఉండాల్సి వస్తుందని చెప్పింది. ఖురాన్‌ చెప్పింది నేను చేస్తాననీ, నేను మంచి వ్యక్తిగా ఉండే ప్రయత్నం చేస్తాననీ, ఎవరో ఏదో అనుకుంటారని బాధపడితే ఎలా సంపాదించి, ఎలా పిల్లలకు తిండి పెడతానని అంటుంది.
    భారతదేశంలో హక్కులూ, ఆచారాల మధ్య జరుగుతున్న సమీకరణ చర్చల్లో తబస్సుమ్‌ లాంటి శ్రామిక వర్గ ముస్లిం మహిళకు తన భావాలను వెల్లడించే కొద్దిపాటి స్థలమే ఉంటుంది. అదే నిజమైన విషాదం.

('ఫ్రంట్‌ లైన్‌' సౌజన్యంతో)
దివ్యా త్రివేది

దివ్యా త్రివేది