May 21,2021 07:12

'ఖులా'ను ఖాజీ సమక్షంలో నోటిమాటగా ప్రకటించవచ్చు, లేదా ఖుల్నామా ద్వారా రాతపూర్వకంగా తెలియజేయవచ్చు. ఆ నిర్ణయాన్ని రద్దు చేసే హక్కు ఖాజీకి లేదు. విడాకులు పొందడానికి ఏ కారణమూ చెప్పనవసరం లేదు. అయితే వివాహ సమయంలో భర్త ఆమెకు మెహెర్‌ ఇచ్చివున్నట్టైతే, దానిని ఆమె తిరిగి ఇవ్వవలసి వుంటుంది.
   విడాకులపై చర్చలో దశాబ్దాల తరబడి రహస్యంగా దాచిపెట్టిన విషయం 'ఖులా'. ముస్లిం మహిళలకు ఖురాన్‌ లో కల్పించిన తిరుగు లేని హక్కు ఇది. ముస్లిం మహిళ కోరుకుంటే విడాకులు పొందే హక్కు 'ఖులా'. ఖురాన్‌ లో సురాహ్‌ బఖారాహ్‌ అధ్యాయంలో ఉంది. ట్రిపుల్‌ తలాఖ్‌ విషయం ఖురాన్‌ లో ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ దాని గురించి వార్తా పత్రికల్లో తెగ చర్చ నడిచింది. కాని 'ఖులా' గురించి ఎన్నడూ చర్చ లేదు. చాలామంది ముస్లిం మహిళలకు సైతం దీని గురించి తెలియదు. 1939లో చేసిన 'ముస్లిం వివాహం రద్దు చట్టం' ముస్లిం మహిళ విడాకులు కావాలనుకుంటే కోర్టుకు పోవలసిందేనని నిర్దేశించింది. ఆ తర్వాత 1972లో ఆ చట్టాన్ని అనుసరించి కేరళ హైకోర్టు ముస్లిం మహిళ విడాకులు పొందాలంటే కోర్టుకు పోవలసిందేనని తీర్పునిచ్చింది. 49 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆ తీర్పును రద్దు చేస్తూ తాజాగా ఏప్రిల్‌ 2021లో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ 'ఖులా' హక్కు చెల్లుతుందని తీర్పునిచ్చింది.
    ''ముస్లిం పర్సనల్‌ లా లో కోర్టుకు పోకుండానే విడాకులు పొందేందుకు ముస్లిం మహిళకు గల హక్కును 1939 చట్టం ఎక్కడా రద్దు చేయలేదు. షరియత్‌ చట్టం లోని సెక్షన్‌ 2 ప్రకారం కోర్టుకు వెలుపల విడాకులు పొందేందుకు ముస్లిం మహిళకు గల హక్కు చెల్లుతుంది. 1972లో ఇచ్చిన తీర్పు చట్ట విరుద్ధం'' అని న్యాయమూర్తులు ఎ.ముహమ్మద్‌ ముస్తాఖ్‌, సి.ఎస్‌. డయస్‌ తీర్పులో వెల్లడించారు.
   ఇటీవల యుక్త వయస్సులో ఉన్న ఒక వివాహిత ముస్లిం మహిళ తన భర్త సంసారానికి అనర్హుడని, తన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని, అందుచేత తనకు విడాకులు కావాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆమె భర్త అందుకు అంగీకరించలేదు. ఆ సందర్భంగా జరిగిన వాదనలలో, ఆ మహిళ తరఫున వాదించిన లాయర్‌ పి.నారాయణన్‌ 1972లో ఇచ్చిన తీర్పు వల్లనే తన క్లయింట్‌ కోర్టు గుమ్మం తొక్కవలసి వచ్చింది తప్ప ఇతరత్రా తనకు కోర్టుకు రాకుండానే విడాకులు పొందే హక్కు ఉందని వాదించాడు. తన క్లయింట్‌ 'ఖులా' హక్కు ప్రకారం విడాకులు తీసుకునే అవకాశం కల్పించాలని కోర్టును కోరాడు. కోర్టు అందుకు సమ్మ తించడంతో ఆమె 'ఖులా' ప్రకారం విడా కులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
    తమ తీర్పులో న్యాయమూర్తులు 1937 ముస్లిం పర్సనల్‌ లా (షరియత్‌) ప్రకారం ముస్లిం మహిళ కోర్టుకు వెలుపలే విడాకులు పొందే హక్కు ఉన్నదని, తలాఖ్‌, ఐలా, జిహార్‌, లియాన్‌, ఖులా, ముబారాత్‌ వంటి పద్ధతులను షరియత్‌ అనుమతిం చిందని తెలిపారు. తలాఖ్‌-ఎ- తఫ్విజ్‌, ఖులా, ముబారాత్‌, ఫష్క్‌ అనే నాలుగు పద్ధతులు ప్రధానమైనవిగా కోర్టు పేర్కొంది. ''ఇస్లాం మతం పురుషుడికి తలాఖ్‌ ద్వారా విడాకులు పొందే హక్కు ఏవిధంగా కల్పిం చిందో, మహిళకూ ఖులా ద్వారా అదే విధంగా విడాకులు పొందే హక్కును కల్పించింది. ఇందుకు ఆమె భర్త ఆమోదం గాని, ఖాజీ తీర్పు గాని అవసరం లేదు. ఈ రోజు ముస్లిం మహిళలకు ఈ హక్కు అమలులో లేకపోవడానికి ముస్లిం పర్సనల్‌ లా (షరియత్‌) ఎంత మాత్ర మూ కారణం కాదు'' అని న్యాయమూర్తులు అన్నారు.
   ఈ తీర్పు పర్యవసానాలు వివిధ దారుల్‌ ఖాజా కోర్టుల్లో పెండింగ్‌ లో ఉన్న అనేక 'ఖులా' కేసులపై ఉండబోతున్నాయి. తలాఖ్‌ కేసుల కన్నా ఖులా కేసులే దారుల్‌ ఖాజా కోర్టుల్లో ఎక్కువగా ఉన్నాయి.
   తలాఖ్‌ ఇచ్చాక ఆ మహిళ బాగోగులను మూడు నెలలపాటు భర్త చూడాలని, ఇద్దత్‌ కాలంలో ఆ మహిళ తన భర్తతోనే ఉండే హక్కు ఉందని షరియత్‌ నిర్దేశిస్తుంది. అదే 'ఖులా' విషయంలో మహిళకు విడాకులు వెంటనే లభిస్తాయి. ఇద్దత్‌ కాలంలో తలాఖ్‌ ను రద్దు చేసుకునే వీలుంది. ఖులా విషయంలో మహిళ వెంటనే భర్త ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు.
   'ఖులా' ను ఖాజీ సమక్షంలో నోటిమాటగా ప్రకటించవచ్చు, లేదా ఖుల్నామా ద్వారా రాతపూర్వకంగా తెలియజేయవచ్చు. ఆ నిర్ణయాన్ని రద్దు చేసే హక్కు ఖాజీకి లేదు. విడాకులు పొందడానికి ఏ కారణమూ చెప్పనవ సరం లేదు. అయితే వివాహ సమ యంలో భర్త ఆమెకు మెహెర్‌ ఇచ్చివున్నట్టైతే, దానిని ఆమె తిరిగి ఇవ్వవలసి వుంటుంది.
 

(వ్యాసకర్త 'ఫ్రంట్‌లైన్‌' అసోసియేట్‌ ఎడిటర్‌)
జియా ఉస్‌ సలామ్‌

జియా ఉస్‌ సలామ్‌