ప్రజాశక్తి - కౌతాళం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించినట్లు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష తెలిపారు. ఆదివారం రాత్రి శ్రీజగద్గురు ఖాదర్ లింగ స్వామి దర్గాలో మజీద్-ఎ-ఖదిర్, దర్గా ఉత్తర ద్వారం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష, ఆదోని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు ఎమ్మెల్యే, నాలుగు ఎమ్మెల్సీలు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. ముస్లింలకు రాజకీయంగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ల ద్వారా అనేక మంది వివిధ రంగాల్లో ఉద్యోగులుగా రాణిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాల్లో ముస్లింలకు రాజకీయంగా ప్రాముఖ్యత లభించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ముస్లిం, మైనార్టీలు కృషి చేయాలని కోరారు. అనంతరం నూతనంగా నిర్మించిన మజీద్-ఎ-ఖదీర్, మదర్సా, దర్గా ఉత్తర ద్వారాన్ని ప్రారంభించారు.
మత సామరస్యానికి ప్రతీక దర్గాలు
- అజ్మీర్ పీఠాధిపతి సయ్యద్ నసురుద్దీన్ చిష్టి
దేశంలో మతసామరస్యానికి ప్రతీకగా దర్గాలు వెలిశాయని దేశంలోనే పేరుగాంచిన అజ్మీర్ ఖాజా బందే నమాజ్ దర్గా ప్రధాన పీఠాధిపతులు సయ్యద్ నసురుద్దీన్ చిష్టి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష పేర్కొన్నారు. శ్రీజగద్గురు ఖాదర్ లింగ స్వామి దర్గా గుల్బర్గా దర్గా, కడపలోని అమీర్ పీర్ పెద్ద దర్గాలో అనుసంధానంగా నమాజ్ కోసం మజీద్‌లో ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. శ్రీజగద్గురు ఖాదర్ లింగ స్వామి పీఠాధిపతులు భక్తులకు సౌకర్యాలను కల్పించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం చిన్నతుంబలం, కోసిగి, కౌతాళం ముస్లిం, మైనార్టీలు వక్ఫ్ బోర్డులో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషకు వినతిపత్రాలు అందజేశారు. అంతకుముందు కౌతాళం దర్గా పీఠాధిపతులు పెద్ద మున్నా పాషా, చిన్న మున్నా పాషా, ఖాదర్ బాషలు అతిథులను శాలువా, పూలమాలలతో సన్మానించారు. కర్ణాటక శాసనసభ స్పీకర్ యుటి.ఖాదర్, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాల నాగిరెడ్డి, తెలంగాణ రాష్ట్రం గద్వాల్ ఎమ్మెల్యే మురళీ కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సబియా పర్వీన్, వక్ఫ్ బోర్డు ఖాజా సాబ్, వైసిపి మండల కన్వీనర్ దేశాయి ప్రహ్లాద చారి, దాట్ల కృష్ణంరాజు, వీర సేనా రెడ్డి, సర్పంచి పాల్ దినకరన్, వైస్ ఎంపిపి బుజ్జి స్వామి పాల్గొన్నారు.