ప్రజాశక్తి - ఆదోని
రాష్ట్రంలోని ముస్లిం, మైనార్టీలకు అండగా ఉంటామని, వారి ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆదోని కమిటీ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. హజ్ యాత్రకు వెళ్తున్న వారి కోసం గత పదేళ్లుగా భోజన వసతి కల్పిస్తున్న మూన్ ఆప్టికల్స్ యజమాని సలాం సాబ్‌ను ప్రత్యేకంగా అభినందించి, అతని కుమారుడు షాబాజ్‌ను సన్మానించారు. ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు అందరూ ముందుకు రావాలని, పదేళ్లుగా సేవా కార్యక్రమం చేస్తున్న మూన్ ఆప్టికల్స్ యజమాని సలాం అభివృద్ధి కోసం దువా చేయాలని హజ్ యాత్రికులకు విన్నవించారు. దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో పార్టీల గెలుపోటముల్లో ముస్లిం, మైనారిటీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని తెలిపారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంలో ముస్లింలు తనకు ఎంతో సహకరించారని చెప్పారు. ఇకముందు కూడా తనకు అలాంటి సహకారం అందించాలని కోరారు. ఆదోని నుంచి ముస్లిం, మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర, జిల్లా, మున్సిపాలిటీ స్థాయి పోస్టులు సాధించారని తెలిపారు. రాష్ట్ర కమిటీలో ముగ్గురు డైరెక్టర్లను, జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా, మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా, మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ముస్లింలను నియమించినట్లు చెప్పారు. ఈద్గా నిర్మాణం కోసం రూ.2.60 కోట్లు మంజూరు చేయించి టెండర్లు కూడా పిలిచామని, త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. మైనార్టీ ఐటి కళాశాలను త్వరలోనే ప్రారంభిస్తామని, ప్రభుత్వ బాలికల ఉర్దూ కళాశాలను ఆదోనిలో ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం స్థల పరిశీలన పూర్తయిందని చెప్పారు. అర్ధాంతరంగా ఆగిపోయిన షాదీ ఖానా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందన్నారు. విజయవాడ నుంచి వెళ్తున్న సుమారు 1831 మంది యాత్రికుల కోసం ప్రత్యేకంగా రూ.14.51 కోట్లు ప్రభుత్వం భరిస్తోందని, ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ జిఒను జారీ చేసిందని తెలిపారు. ప్రతి యాత్రికుడిపైనా రూ.80 వేల భారం పడుతోందని ప్రచారం చేశారని, ఆ భారాన్ని మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. శిక్షకులు మౌలానా అబ్దుల్ మజీద్, కౌడల్ పేట్ సయ్యద్ అమన్, ఎస్‌ఎంబి.హన్ను, అహ్మద్, అహ్మద్ హుస్సేన్, అల్తాఫ్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి










