ముస్లిం మైనారిటీల అభివవృద్ధిని అడ్డుకుంటున్నారు
టిడిపి రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్
ప్రజాశక్తి- నంద్యాల కలెక్టరేట్
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, అధికార మదంతో ఊగిపోతున్న వైసిపి నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని టిడిపి రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలాన ముస్తాక్ అహ్మద్ హెచ్చరించారు. గురువారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి నాయకులు చేసిన ఆరోపణలను, అవాస్తవాలను తీవ్రంగా ఖండించారు. వక్ఫ్‌బోర్డ్ స్థలంలో నిర్మించిన మదరసాను పోలీసులు వైసిపి నాయకులకు వత్తాసు పలుకుతూ అక్రమంగా సీజ్ చేయడం బాధాకరమన్నారు. లంచాలకు అలవాటుపడ్డ వక్ఫ్‌బోర్డ్ అధికారులు వైసిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జామియా మజీద్ కమిటీలో ఎమ్మెల్సీ ఇసాక్ భాషా అక్రమంగా కొనసాగుతున్నారని ఆరోపించారు. నంద్యాలలో వక్ఫ్ స్థలం లీజ్‌కు తీసుకొని మదరసా, మసీదులను సొంత ఖర్చులతో అభివృద్ధి చేశానన్నారు. టిడిపిలో క్రియాశీలకంగా ఉన్నానని తనపై కక్షగట్టి వేధిస్తున్నారని ఆవేదన చెందారు. కోట్ల విలువైన వక్ఫ్ భూమిని హిందూజాకు కట్టబెట్టి దోచుకున్నది వైసిపి నాయకులేనని ఆరోపించారు. వైసిపి నాయకుడు ఖాదర్ బాషా, ఎమ్మెల్సీ ఇసాక్ భాష, స్థానిక ఎమ్మెల్యే శిల్పా పెద్ద గజ దొంగలని, వారు చేసే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని విమర్శించారు. త్వరలో అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బహిర్గతం చేస్తామని తెలిపారు.










