ప్రజాశక్తి-భట్టిప్రోలు: గత ఇరవై ఏళ్లుగా భట్టిప్రోలులో నడుస్తున్న హెరిటేజీ ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీని యాజమాన్యం అర్ధాంతరంగా మూసివేతకు రంగం సిద్ధం చేసింది. దీనిలో పని చేసే కార్మికులు, సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మూసివేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీంతో ఇక్కడ పనిచేసే సుమారు 70 మందికి పైగా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనిలో శాశ్వత ఉద్యోగులు దాదాపు 35 మంది వరకు ఉండగా దినసరి కూలీలుగా మరో 30 మంది, ఇక్కడ తయారుచేసే పాల ప్యాకెట్లు, పెరుగు, మజ్జిగ వంటి ప్యాకెట్లను తరలించే వాహన డ్రైవర్లు మరో 10 మందికి పైగా ఉన్నారు. వీరిలో శాశ్వత ఉద్యోగులు ఇక్కడ అందించే వేతనానికే మరో ప్రాంతంలో ఉన్న కంపెనీలో చేర వచ్చు. లేకుంటే ఉద్యోగం మానుకోవచ్చు అనే నిబంధనను యాజమాన్యం వెలుబుచ్చింది. కాగా రోజుకు 380 రూపాయలకు పనిచేసే కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దినసరి కూలీలకు కూడా కంపెనీ నిబంధనల ప్రకారం పిఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. వీరు కూడా కంపెనీ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ పని చేస్తున్నారు. వీరికెవ్వరికీ ఇప్పటివరకు కంపెనీ మూసివేస్తున్నట్లు సమాచారం కూడా తెలియనీయకుండా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత నెల రోజులుగా ఫలానా తేదీన మూసివేస్తున్నామని అంటూ నాలుగుసార్లు కంపెనీ ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చినట్లు అక్కడ పనిచేసే పలువురు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం మరో రెండు మూడు రోజులలో ఇక్కడ కంపెనీని అర్ధాంతరంగా మూసివేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు పలువురు చెబుతున్నారు. 2003 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీలో తయారు చేసే ఆహార ఉత్పత్తులు ఉమ్మడి గుంటూరు జిల్లా, కష్ణా, ప్రకాశం జిల్లాలకు లారీల ద్వారా సరఫరా అవుతుంటాయి. రాష్ట్రం మొత్తంలో ఉన్న దాదాపు పది హెరిటేజీ కంపెనీలలో భట్టిప్రోలు ఒకటి. ఇప్పటికే శాశ్వత ఉద్యోగులను హైదరాబాద్, పశ్చిమ గోదావరి, కర్నూలు వంటి ప్రాంతాలలో ఉన్న కంపెనీలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందినట్లు సమాచారం.
'ఈ నెల 12 నుంచి పిల్లలకు పాఠశాలలు తెరిచారు. ఇప్పటికే పిల్లలను పాఠశాలల్లో చేర్పించాము. ఇప్పటికిప్పుడు మరో ప్రాంతానికి బదిలీ చేస్తే ఎలా వెళ్లాలి' అంటూ కొందరు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇదిలావుండగా ఎప్పటి నుంచో దినసరి కూలీలుగా పనిచేస్తున్న తమను తొలగించి కంపెనీ మూసివేస్తే తాము ఎలా బ్రతకాలి అంటూ పలువురు కార్మికులు వాపోయారు. ఇక్కడ కంపెనీ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా లాభాల బాటలోనే నడుస్తున్న కంపెనీని మూసివేస్తే కార్మిక చట్ట ప్రకారం కార్మికులకు కంపెనీ జీవనోపాధి కల్పించాల్సిఉందని, దానిపై ఎలాంటి చర్యలు లేకుండా అర్ధాంతరంగా మూసివేస్తే కార్మిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని, దీనిపై కార్మిక శాఖ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై కంపెనీ మేనేజరును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.










