Feb 20,2023 00:09

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న గిరిజన సంఘం నాయకులు.

వారంరోజుల్లో ఇద్దరు విద్యార్థుల మృతిపై ఆందోళన
గిరిజన సంఘం ఎదుట తల్లిదండ్రుల ఆవేదన
ప్రజశక్తి-రాజవొమ్మంగి :
వారం రోజులు వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృత్యువాత పడిన దేవీపట్నం మండలం ముసినిగుంట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు తమ పిల్లలను పంపేదిలేదనివిద్యార్థినుల తల్లిదండ్రులు గిరిజన సంఘం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు, ఆదివారం దేవిపట్నం మండలంలోని కచ్చులూరు, పెనీకిలపాడు, మంటూరు, బీరంపల్లి కాలనీలో ఆదివారం గిరిజన సంఘం జిల్లా నాయకులు పర్యటించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు,
ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లిరెడ్డి మాట్లాడుతూ, ముసినిగుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికలు ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల వ్యవధిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందడం బాధాకరమన్నారు. మరి కొంతమంది విద్యార్థినులు చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పాఠశాలకు తమ విద్యార్థినులను పంపించాలంటే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. తమ పిల్లలను పాఠశాలకు పంపి శవాలుగా మార్చలేమని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారని, వారి ఆక్రందనను అర్థం చేసుకోవాలన్నారు.ఆశ్రమ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్‌, గిరిజన సంక్షేమ అధికారులు విద్యార్థినుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. పిల్లలకు మెనూ ప్రకారం సరిగ్గా భోజనం పెట్టడం లేదని, వారి ఆరోగ్యం పట్ల కనీస శ్రద్ధ కనబరచడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ముసినిగుంట ఆశ్రమంలో విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హాస్టల్‌లో ఎఎన్‌ఎం నియమించాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని, హెల్త్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు సాదాల విద్యాసాగర్‌ రెడ్డి, కుంజం బాపన్నదొర, కంభం శాంతి రాజుు పాల్గొన్నారు.