Apr 24,2023 00:10

కాల్వలోని మురుగునీరు

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : సాగునీటితో గలగల పారిన పంట కాల్వ నేడు మురుగు నీటితో దుర్గంధం వెదజల్లుతోంది. ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లిలో కాల్వ దుస్థితిని సిపిఎం, రైతు సంఘం నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ కుంచనపల్లిలోని ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీం నుండి ప్రాతూరు, చిర్రావూరు, రామచంద్రపాలెం వరకు సుమారు 3,600 ఎకరాలకు నీరందించిన పంట కాల్వ దుస్థితి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. కుంచనపల్లి పరిసర ప్రాంతాల్లో బహుళంతస్తుల భవనాలు నిర్మితమయ్యాక ఆ భవనాల్లోని వ్యర్థపు నీరంతా పంట కాల్వకే వదులుతున్నారన్నారు. దీనివల్ల కాల్వ పూర్తిగా దెబ్బతిని, మురుగినీటి కాల్వగా మారిందని చెప్పారు. సాగు నీటిలో మురుగు నీరు కలవడం, వాటిని పొలాలకు పెట్టడంతో పంటలన్నీ దెబ్బతింటున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. తమ పచ్చని పొలాలు దెబ్బతింటున్నాయని, మురుగునీరు వలన చర్మ వ్యాధులు వస్తున్నాయని చిర్రావూరు రైతులు పలుమార్లు ఆందోళన చేసినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో అధికారులను కలిసి రైతుల సమస్యను అనేకసార్లు విన్నవించినా స్పందన లేకపోవడం దుర్మార్గమన్నారు. సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నివాసానికి కిలోమీటర్లు లోపు ఉన్న పంట కాల్వను అధికారులు పట్టించుకోకపోవడం రైతుల పట్ల నిర్లక్ష్యానికి తార్కాణమని అన్నారు. 1965లో కుంచనపల్లిలో ఏర్పాటు చేసిన ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీం ద్వారా ఐదు గ్రామాలకు సుమారు 3600 ఎకరాలకు నీరందెదని, ప్రస్తుతం పంట కాల్వ పూర్తిగా దెబ్బతిని, పొలాలకు నిరందించే పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా రూ.లక్షలతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు నిర్మించిన డ్రెయినేజీలు నిరుపయోగంగా మారాయని, మురుగు నీటిని పంట కాల్వకు మళ్లించడం సరికాదని అన్నారు. కుంచనపల్లి అరవింద హైస్కూల్‌ వద్ద పంట కాల్వ దుస్థితి మరింత దారుణంగా మారిందని, పూర్తిగా మురుగునీరుతో దుర్గంధం వెదజల్లుతోందని ఆందోళ వ్యక్తం చేశారు. దీనివలన అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. దోమల ఉధృతి పెరిగి విద్యార్థులకు చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అపార్టుమెంట్ల నుండి వచ్చే డ్రెయినేజీ నీటిని శుద్ధి చేసి మద్రాసు కాల్వకు మళ్లించాలని, ఇందుకు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను సత్వరమే నిర్మించాలని, పంట కాల్వను బాగుచేయించాలని డిమాండ్‌ చేశారు. పరిశీలనలో నాయకులు ఎ.రంగారావు, కె.వెంకటేశ్వరరావు, ఎ.రామారావు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా పంట కాల్వ దుస్థితిని పరిశీలించేందుకు వచ్చిన నాయకులను అరవింద హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ బి.ఇంద్రాణి కలిసి మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు, ప్రభుత్వానిదని అన్నారు. 35 ఏళ్లుగా హైస్కూల్‌ను ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుపుతున్నామని, కొంతకాలంగా కాల్వ చుట్టూ వ్యర్ధాలతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోందని చెప్పారు. ఈ దుస్థితిపై తనతో పాటు, విద్యార్థులు కూడా ముఖ్యమంత్రికి లేఖలు రాశామని, అయినా స్పందన, పరిష్కారం లేదని అన్నారు. స్కూలు సమీపంలో ఉన్న పంట కాల్వ దుస్థితి దారుణంగా ఉందని, మురుగునీటి దుర్గంధం వల్ల విద్యార్థులు ముక్కు మూసుకొని మరి స్కూలు వైపుకు వెళ్లే పరిస్థితి దాపురించిందని చెప్పారు. ప్రస్తుతం తాగునీరూ కలుషితమై పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతోం దన్నారు. కలుషిత వాతావరణం, మురుగునీరు వల్ల అనారోగ్యానికి గురై పిల్లలు, పెద్దలు జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని చెప్పారు. వ్యర్ధాలను, మురుగు నీటిని పంట కాల్వలో మళ్లించకుండా ఎక్కడికక్కడే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.