Sep 10,2023 23:44

- మురుగుతో విషజ్వరాలు, అంటు రోగాలతో అవస్థలు
- రహదారి సౌకర్యంలేక రామంటున్న ఆటోలు, రిక్షాలు
- జబ్బొస్తే మోసుకెళ్లడం తప్ప మరో మార్గంలేదు
ప్రజాశక్తి, - భట్టిప్రోలు
ఎన్నో ఏళ్లుగా పట్టణంలోని 8వ వార్డులో నిల్వ ఉన్న మురుగునీటి పారుదలకు అధికారులు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఒకప్పుడు మాగాణి  భూములుగా ఉన్న ఈ స్థలాలు క్రమక్రమంగా నివేశినా స్థలాలుగా మారాయి. అసలే లోతట్టు ప్రాంతంగా ఉంటుంది. గ్రామానికి చుట్టుపక్కల సాగునీటి కాలువ ప్రవహిస్తూ ఉండటంతో అధిక వర్షాలు, సాగునీటి ఉధృతితో లోతట్టు ప్రాంతం జలమయం అవుతుంది. ఈ ప్రాంత ప్రజలు వర్షాకాలం వస్తే మురుగునీరు ఇళ్లను చుట్టుముడుతుంది. దీంతో ఇళ్లు కాళీ చేసి బయటకు వెళుతున్న సంఘటనలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో మురుగు నీటిపారుదల మళ్లింపుకు రూ.కోట్లు ఖర్చుపెట్టారు. అయినా నిరుపయోగం అయ్యింది. ప్రణాళిక లేకుండా చేసిన డ్రైన్‌ పనులు వృధా అయ్యాయి. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వెనక లోతట్టు ప్రాంతంతో పాటు గిరిజన కాలనీ సమీపంలో కొందరు వ్యాపారస్తులకు చెందిన సొంత స్థలాలు కూడా పల్లప్రాంతంగా మారి ఏళ్ల తరబడి ఎండ, వానలతో సంబంధం లేకుండా మురుగునీరు నిల్వ ఉంటుంది. దీంతో సీజన్‌తో పని లేకుండా అనునిత్యం దోమలు వృద్ది చెందుతూనే ఉంటాయి. ఎక్కడా లేని విధంగా బోదకాల వ్యాధి పూర్తిగా వ్యాపించి ఉంది. మురుగునీటితో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో సందర్శించిన డిపిఓ, ఆర్డిఓల సూచనలతో పంచాయతీ అధికారులు నీటిని బయటికి పంపేందుకు ఇంజన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేదు. ఒక ప్రాంతంలో తోడే నీరు మరో ప్రాంతంలోకి వచ్చి చేరుతుంది. 

సొంత స్థలాల యజమానులపై చర్యలేవి?
మురుగునీరు నిల్వ ప్రాంతం సొంత స్థలాలు కావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకులేకపోతున్నారు. పంచాయితీల్లో ఖాళీ స్థలాలకు పన్నులు వేసే విధానం లేకపోవడంతో స్థలం యజమానులు పట్టించుకోవడంలేదు. ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలిచి ప్రజలకు ఇబ్బందిగా మారింది. మురుగునీటి పారుదలకు శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది.

జ్వరం వస్తే భుజాలపై తీసుకెళ్లాల్సిన దుస్థితి 
మురుగు నీటి ఆవాస ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్‌కు వెళ్లేందుకు కూడా రహదారి మార్గం లేదు. ఎవరికైనా ఆనారోగ్యానికి గురైతే భుజాలపై మోసుకొని వెల్లటూరు ఛానల్ వైపు వంతెనకు లేదా బస్టాండ్ వైపు వంతెన వరకు వెళ్లాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. కాలువ కట్ట రహదారి మార్గమే ఏకైక మార్గమని కాలనీ వాసులు చెబుతున్నారు. వర్షం వస్తే బురదమయం కావడంతో ఆర్ఎంపి వైద్యులు కూడా వచ్చే పరిస్థితి లేదు. వైద్యశాలకు వెళ్లడానికి ఆటోలు, రిక్షాలు వచ్చే పరిస్థితి లేదు. మోసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఎవరికైనా చెబితే అంతే నంటు అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. సమస్యలు తమకే చెప్పాలని అంటున్నారు. పంచాయితీ అధికారులైతే కనీసం బ్లీచింగ్‌ కూడా చల్లడంలేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మురుగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.