ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : ఊరుగొప్ప... పేరుదిబ్బ ఉన్న చందంలా ఉంది జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణం పరిస్థితి. జిల్లా కేంద్రంలోని ప్రజలే అనేక సమస్యల మధ్య జీవనం సాగిస్తుంటే ఇక పల్లెల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పట్టణంలోని 9వ వార్డు పరిధిలో గల విజయరామరాజు కాలనీలో పరిస్థితిని చూస్తే అర్ధమవుతుంది. ఈ కాలనీ ఉన్న మొదటి వీధిలో నివాస గృహాల ప్రాంతం కాలువలో ఉన్న మురుగునీరు గత నాలుగు రోజులుగా రహదారిపైకి చేరి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో కుళాయిల ద్వారా తాగునీరు పట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోతుందని, గత్యంతరం లేక మురుగునీరు మధ్యలో దుర్వాసనను భరిస్తూ తాగునీరు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీ గానీ, ప్రజారోగ్య విభాగం అధికారులుగానీ, సిబ్బంది గానీ పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే మురుగునీరు మరికొన్ని రోజులు రహదారిపై నిల్వ ఉంటే రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవ్వడం ఖాయమని ఆ వీధి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.










