ప్రజాశక్తి -తగరపువలస : సంగివలస కొండప్ప చెరువును ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డుపై నెలల తరబడి నిలిచిన మురుగు నీటిని మళ్లించాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం టిడిపి నగర కార్యదర్శి పిట్టా సురేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, సర్వీసురోడ్డుపై ఏనాడో కురిసిన వర్షపునీరు నేటికి నిలిచి ఉండడంతో స్థానిక అల్లూరి సీతారామరాజు కాలనీ, సబ్బి వారి కల్లాల వాసులతోపాటు ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై అనేకమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఎటువంటి స్పందన లేదని ఆరోపించారు. తగరపువలసలోని అనేక ప్రాంతాల్లో అశాస్త్రీయంగా రోడ్లు, కాల్వల నిర్మాణంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచి, ప్రజలు రోగాలబారిన పడుతున్నా అధికారుల్లో కదలిక లేకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో 1,2 వార్డుల టిడిపి అధ్యక్షులు టి సూరిబాబు, బడిగింటి నీలకంఠం, పార్టీ నేతలు వానపల్లి సత్య, చోడిపల్లి సాయికుమార్, గణేష్, జోగ సన్యాసిరావు, గిడుతూరి శ్రీనివాసరావు , మద్దిల సుబ్బారావు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.










