రోడ్డుపై పారుతున్న మురుగు
మురుగుమయంగా రోడ్లు..!
నిద్రావస్థలో అధికారులు
ప్రజాశక్తి-కావలిరూరల్:పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాగా తయారైంది రాజు వారి చింతలపాలెం గ్రామం. అధికారుల పనితీరు స్వచ్ఛతలో రాష్ట్రంలోనే ఎంతో ముందు ఉన్నామంటూ గొప్పలు చెప్పుకుంటూ
ప్రచారాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. వాస్తవ రూపంలోకి వెళితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉంది రాజు వారి చింతలపాలెం గ్రామం.ఈ గ్రామంలో సక్రమంగా రోడ్లు, సైడ్ కాలువలు లేకపోవడంతో ఇళ్లల్లో నుంచి వచ్చే మురుగు నీరు, వర్షాలప్పుడు వచ్చే వర్షపు నీరు రోడ్లపై చేరడంతో ఆ గ్రామంలోని ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎన్నో ప్రభుత్వాలు మారిన ఈ గ్రామంలోని ప్రజల సమస్యలు మాత్రం మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మురుగు నీరు రోడ్లపై చేరుతున్నాయి. రోడ్లన్నీ మురుగు మయం అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దోమల బెడద, దుర్వాసనతో గ్రామంలోని ప్రజలు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కలగా మిగిలిన ఆరో ప్లాంట్ నిర్మాణం ఈ గ్రామంలోని ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ గ్రామంలో ఆరో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలని గతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దష్టికి గ్రామస్తులు తీసుకుపోయినట్లు తెలిపారు. ఇప్పటివరకు మా గ్రామంలో ఆరో ప్లాంట్ నిర్మాణం పనులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.










