Sep 14,2023 00:38

ప్రజాశక్తి - భట్టిప్రోలు
గ్రామంలో నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. డిపిఓ రాంబాబు అధికారులను మంగళవారం హెచ్చరించిన నేపథ్యంలో సాయంత్రానికి ప్రోక్లైన్ ద్వారా పుడిక తీత చేపట్టారు. ప్రస్తుతం నిల్వ ఉన్న మురుగునీటిని బయటకు తరలించారు. అయితే వర్షాలు పడితే మరోమారు ముంపుకు గురికాక తప్పదు. ఈ ఏడాదికి కచ్చా డ్రెయిన్తో  మురుగునీటి పారుదలకు చర్యలు తీసుకున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపాలని ఆ ప్రాంతవాసులు కోరుచున్నారు. మురుగు నిల్వ ఉన్న సొంత స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చి రానున్న వేసవిలోనైనా మెరకలు తోలుకునే విధంగా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఎప్పటికప్పుడు వర్షాలకు వచ్చే మురుగు నీటిని నిల్వ లేకుండా బయటకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ జెడి  హనుమంతరావు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుమ్మా చంద్రశేఖర్, కార్యదర్శి కోట శ్రీనివాసరావు, సర్పంచి ధారా రవికరణ్మయి, నాయకులు చెన్నయ్య  ఉన్నారు.