Sep 19,2023 19:05

ప్రజాశక్తి వార్తకు స్పందన
ప్రజాశక్తి - మండవల్లి
   మండలంలో విస్తరణ అధికారి ఆనంద్‌బాబు మురుగునీరు పోయేలా చర్యలు చేపట్టి, వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్‌, సున్నం పంచాయతీ సిబ్బందితో దగ్గరుండి చేయించారు. కాంట్రాక్టర్‌కి కాసులు, అధికారులకు ముడుపులు, మాకు కష్టాలు ఇదేనా పంచాయతీ పరిపాలన అంటూ మండవల్లి గ్రామస్తులు పంచాయతీ అధికారులను, సర్పంచిని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న పనుల వల్ల వెలమపేట రహదారిపైకి మురుగునీరు చేరుకున్నా పట్టించుకోకపవడంతో పంచాయతీ తీరుపై గ్రామస్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనపై ప్రజాశక్తిలో 'డ్రెయినేజీలు అస్తవ్యస్తం' పట్టించుకోని అధికారులు అనే శీర్షికతో వార్త సోమవారం ప్రచురితమైంది. దీంతో స్పందించిన విస్తరణ అధికారి ఆనందబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రహదారి మురుగునీటి మునిగి వారం రోజులవుతున్నా దుర్వాసనతో, దోమలతో నానా అవస్తలు పడుతున్నా ఎవరు పట్టించుకోలేదని వారు ఆయనకు తెలిపారు. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం పరిశీలించేందుకు కూడా సంఘటన స్థలానికి రాలేదన్నారు. దీంతో మురుగునీటిలో దోమలు వ్యాప్తి చెంది, రాత్రి వేళలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఆయన వెంటనే పంచాయతీ సిబ్బందిని సంఘటన స్థలానికి పిలిపించి మురుగునీరు పోయేలా చర్యలు చేపట్టి, వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్‌, సున్నం చెల్లించారు. గ్రామస్తులు పడుతున్న ఇబ్బందిని ప్రజాశక్తి ద్వారా తెలుసుకొని వెంటనే స్పందించి సమస్యను దగ్గరుండి పరిష్కరించిన ఆనందబాబును స్తానికులు అభినందించారు.