Jul 18,2022 23:42

మాట్లాడుతున్న జోనల్‌ కమిషనర్‌ మల్లయ్యనాయుడు

ప్రజాశక్తి - కంచరపాలెం : వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడికక్కడ మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలని జీవీఎంసీ జోన్‌ -5 కమిషనర్‌ మల్లయ్య నాయుడు స్థానిక ప్రజలకు, పారిశుధ్య సిబ్బందికి సూచించారు. జీవీఎంసీ 53వ వార్డు పరిధి శివనగర్‌ తదితర ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. పారిశుధ్య పనులకు సంబంధించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండేందుకు వ్యక్తిగత శుభ్రతతో పాటుగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం డెంగీ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు జీవీఎంసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. నిరంతరం పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని సచివాలయ శానిటేషన్‌ సిబ్బందికి ఆదేశించారు. ప్రతి ఒక్కరూ విధిగా వారానికి ఒకసారి డ్రై డే పాటించే విధంగా సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్‌, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.