- ప్రధాన రహదారి కంపుకంపు
- కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం
-వాహనదారుల అవస్థలు
ప్రజాశక్తి - తిరుపతి సిటి
నిత్యం వాహనాలు, వేలాది మంది పాదచారులు తిరిగే రహదారి. ఈ దారిలో అనేక విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు అనేకం ఉన్నాయి. కానీ డ్రైనేజీ నీరు పొంగి ప్రతి రోజూ రహదారి మొత్తం మురికిమయం అవుతుంది. ఇది ఏ మారుమూల ప్రాంతమో కాదు. నగరానికి వచ్చే ప్రధాన రహదారి. తిరుపతి-రేణిగుంట రోడ్డు మార్గంలో గొల్లవానిగుంట సర్కిల్ వద్ద. రోడ్డుపైనే మురికినీరు నిలిచిపోవడంతో దోమలు, క్రిములు వల్ల స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపుల ఉన్న వివిధ షాపుల్లో పని చేసే కార్మికులు సైతం అక్కడికి వెళ్లేందుకు దారి సక్రమంగా లేక విధిలేని పరిస్థితుల్లో మురికినీటిలోంచి వెళ్లుతుండడం గమనార్హం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రేణిగుంట నుంచి తిరుపతికి ఈ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంది. ఈ మురికి నీటి ద్వారా వచ్చే దుర్వాసనను భరిస్తూ తిరుపతిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ మురికి నీటి వల్ల ప్రతి రోజూ ఏదో ఒక ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడం వాహనచారులకు తరచూ గాయాలు పాలవడం జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్‌అండ్‌బి, తిరుపతి కార్పొరేషన్ అధికారులు నిమ్మ కునీరెత్తినట్లు వ్యవహరి స్తుండడం శోచనీయం. వర్షం వస్తే ఈ సమస్య మరింత జఠిలం. అనేక పర్యాలు స్థానికులు స్థానిక కార్పొ రేటర్‌కు, కార్పొరేషన్ అధికారులకు, ఆర్‌అండ్ బి అధికారులకు విన్న వించినా పట్టించు కోవడం లేదు. ఇదేమని అడిగితే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నీరు పొంగుతుంది. అది కార్పొరేషన్ అధికారులే చూడాలని, ప్రదాన రహదారి కనుక అది ఆర్ అండ్ బి అధికారులు పరిస్కరించాలని ఒకరికొక్కరు కప్పతాడు సమాధానాలు చెబుతూ నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.










