Jul 18,2023 21:45

ప్రజాశక్తి - సీతానగరం : మండలంలోని బూర్జ పంచాయతీ ఆవాలవలస గ్రామానికి చెందిన ఆవాల శ్రావణి (14) మూర్ఛ రావడంతో చెరువులో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు మేరకు ఆవాల శ్రావణి గాదిలవలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఎప్పటిలాగే మంగళవారం సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా మార్గ మధ్యలో ఫిట్స్‌ రావడంతో చెరువులో పడింది. ఈ విషయం గమనించిన వేరే విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు చెరువులో దిగి వెతకడంతో అప్పటికే శ్రావణి మృతి చెందింది. ఒక్కగానొక్క కుమార్తె మరణించడంతో ఆమె తల్లిదండ్రులు సత్యం, పార్వతి కన్నీరుమున్నీరై రోధించారు. గ్రామమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.