Oct 31,2022 21:30

కెవిపిఎస్‌ ఆధ్వర్యాన నిరసన
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

మండలంలోని శ్రీనివాసపురంలో హత్యకు గురైన దళిత యువకుడు ముప్పిడి రాజు కేసుపై న్యాయ విచారణ జరపాలని కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో దళిత పాలేరు ముప్పిడి రాజు హత్యపై వాస్తవాలను వెల్లడించాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో దళిత పాలేరు ముప్పిడి రాజును రైతు పోల్నాటి రామకృష్ణ, అనుచరులు గత సంవత్సరం ఆగస్టు 13న అత్యంత దుర్మార్గంగా హత్య చేసి చెరువులో పడేసారని ఆరోపించారు. అప్పుడున్న డిఎస్‌పి డాక్టర్‌ రవి కిరణ్‌ దీన్ని ఆత్మహత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హత్య కేసు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుగా నమోదు చేశారని తెలిపారు. 15 నెలలు గడిచినా రాజు హత్యకు సంబంధించి ఎలాంటి పోస్టుమార్టం రిపోర్ట్‌ రాకుండా నేరస్తులకు పోలీసు, ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ముప్పిడి రాజు కుటుంబాాన్ని ఆదుకోవాలని ఆందోళన చేయగా ప్రభుత్వం ఒకరికి ఉద్యోగం, ఒకరికి పెన్షన్‌, ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని అనేక హామీలిచ్చిందని, వాటిలో వేటినీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముప్పిడి రాజు హత్య కేసుపై ఆర్‌డిఒ సమక్షంలో సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని, మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ముప్పిడి రాజు తల్లిదండ్రులు ఏసు, మరియమ్మ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్‌డిఒ ఝాన్సీరాణికి స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్‌, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.