Mar 16,2021 06:27

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసిపి అసాధారణ విజయం సాధించింది. ఈ నెల పదిన పోలింగ్‌ నిర్వహించగా ఆదివారం వెలువడ్డ ఫలితాల్లో మొత్తానికి మొత్తం పదకొండు కార్పొరేషన్లు, 75 పురపాలికల్లో 73 ఆ పార్టీ సునాయాసంగా తన ఖాతాలో వేసుకుంది. కేవలం రెండు మున్సిపాలిటీలలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి మెజార్టీ వార్డులు దక్కించుకుంది. మొన్నటి పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితం అయినందున పార్టీల బలాబలాలపై అంతగా స్పష్టత ఉండదు. పుర పోరు పార్టీ గుర్తులపై జరగడంతో పార్టీల సత్తా తెలిసొచ్చింది. వైసిపికి 52.63 శాతం, టిడిపికి 30.73 శాతం ఓట్లు వచ్చాయి. వైసిపి ఘన విజయానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగా ఉపకరించాయి. దాంతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది. ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీ మంచినీళ్ల ప్రాయమైందన్న విషయం బాహాటమే. ఓటర్లకు ప్రలోభాలు మొన్నటి పంచాయతీ ఎన్నికలను తలదన్నాయి. బలవంతపు ఏకగ్రీవాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగ ఆరోపణలు చెప్పనలవి కాదు. మున్సి'పోల్‌'పై ఆది నుంచి వివాదాలు ముసురుకున్నాయి. గతేడాది మార్చిలో నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తయ్యాక కరోనా భయంతో ముందస్తుగా ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) వాయిదా వేసింది. కోర్టు వ్యాజ్యాల అనంతరం, ప్రక్రియ ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడి నుంచి ప్రారంభించారు ఎస్‌ఇసి. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ అమలు చేశారు. 


ఎన్నికల ఫలితాలపై ఇటు వైసిపి అటు టిడిపి చేస్తున్న విశ్లేషణలు పాక్షిక దృష్టిని కలిగి ఉన్నాయి. ఎవరికి వారు తమను తాము సమర్ధించుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసిపి గెలుపొందింది కాబట్టి పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల తమ విధానానికి ప్రజలు మద్దతిచ్చారని ప్రభుత్వం చెబుతోంది. టిడిపి సైతం ఎన్నికల ప్రచారంలో స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు, అభివృద్ధి, పన్ను భారాల వంటి కీలక విషయాలను వదిలేసి తమకు ఉపయోగపడుతుందనే ఆశతో అమరావతి అంశాన్ని తెరమీదికి తెచ్చింది. వీరిద్దరు ఎంచుకున్న వైఖరి తప్పు. స్థానిక ఎన్నికలు స్థానిక అంశాలు, పరిస్థితులపై జరుగుతాయి. కేంద్రంలోని బిజెపి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్న సమయాన విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైసిపి గెలుపుపై చేస్తున్న విశ్లేషణలు సందర్భోచితమూ కాదు. వాస్తవమూ కాదు. వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణను బిజెపి మినహా వైసిపితో పాటు అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి. అలాంటప్పుడు విశాఖ కార్పొరేషన్‌లో వైసిపి గెలుపు మీద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రభావం ఏమీ పడలేదని వైసిపి నేతలు వ్యాఖ్యానించడం కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు పంపడం కాగలదు. 'విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు' నినాదం చెరగనిది. దాని ప్రైవేటీకరణను తెలుగు వాడెవడూ సహించడు. 


ప్రధాన ప్రతిపక్షం టిడిపి మున్సిపోల్స్‌లో నిలవలేకపోయింది. అందుక్కారణం ఆ పార్టీ వద్ద ప్రత్యామ్నాయాలు లేకపోవడమే. పట్టణ సంస్కరణల పేరుతో కేంద్ర బిజెపి ఆస్తి విలువ ఆధారంగా ప్రాపర్టీ, చెత్త, సీవరేజి, నీటి పన్నులను ప్రతిపాదించగా టిడిపి తన హయాంలో అమలు చేసింది. అందుకే ఆస్తి పన్ను తగ్గింపు వంటి ఆ పార్టీ హామీలు చెల్లలేదు. ఎన్నికల ఫలితాలతో మరింతగా సత్తువ సన్నగిల్లిన పార్టీ కేడర్‌లో నిరుత్సాహం తొలగించేందుకు టిడిపి నాయకత్వం ఎలాంటి నిర్దేశం చేస్తుందో, కేడర్‌ ఏ మేరకు స్వీకరిస్తుందో చూడాలి. ఎన్నికల్లో ఘన విజయంతో అధికార వైసిపి తాను తీసుకునే అన్ని విధానాలకు ప్రజలు మద్దతు తెలిపారనడం హ్రస్వ దృష్టి మాత్రమే. కేంద్రం ఆదేశానుసారం పట్టణాల్లో ఆస్తి పన్నులు, చెత్త పన్నులు, 'బిల్డ్‌ ఎ.పి' పేరిట భూముల అమ్మకం, ప్రైవేటీకరణ వంటి చర్యలు ప్రజలకు హాని కలిగిస్తాయి. మరిన్ని భారాలు మోపుతాయి. సంక్షేమ చర్యలను ప్రజలు ఎంతగా ఆహ్వానించారో, భారాలను గనుక మోపితే అంతకన్నా గట్టిగా ప్రతిఘటిస్తారు. అందుచేత స్థానిక సంస్థలకు తోడ్పాటునందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.