ప్రజాశక్తి - సాలూరు : మున్సి'పల్టీ' కొడుతున్నా స్థానిక పాలకుల్లో చలనం లేదు. నెలరోజులుగా పురపాలన స్తంభించింది. గత కమిషనర్ హెచ్ శంకరరావు ఎసిబి వలలో చిక్కి సస్పెండ్ కావడంతో కొత్త కమిషనర్ నియామకంపై ఇంకా స్పష్టత లేదు. దీంతో పురపాలన ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం చెప్పే నాధుడు కరువయ్యారు. ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎఇ సూరినాయుడు భయపడుతూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిఇ ఇంఛార్జిగా ఆయనే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఇంఛార్జి కమిషనర్ బాధ్యతలు తలకుమించిన భారమని ఆయన భావిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి విజయకుమార్ విధుల్లో చేరిన నెలరోజులకే బదిలీపై వెళ్లిపోయారు. మున్సిపల్ రెవెన్యూ అధికారి టి.రమేష్ మృతి చెందారు. దీంతో జనం సమస్యలు ఎక్కడికక్కడే ఉంటున్నాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ అప్పుడప్పుడూ కార్యాలయానికి వస్తున్నా ప్రధాన విభాగాల అధికారులు ఖాళీగా ఉండడంతో అభివృద్ధి పనులు ముందుకు కదలడం లేదు.
మాముళ్లు సమర్పించకే కమిషనర్ నియామకం జాప్యం!
మున్సిపల్ కమిషనర్ నియామకంలో జాప్యానికి అసలు కారణం మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయంలో ఆమ్యామ్యాలు సమర్పించకపోవ డమేనని తెలుస్తోంది. ఇక్కడికి కమిషనర్‌గా రావడానికి ఇద్దరు అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖపట్నం జివిఎంసిలో పని చేస్తున్న మహిళా అధికారి ఇక్కడికి కమిషనర్‌గా రావడానికి ఆసక్తి చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పాలకొండ నగర పంచాయతీ మేనేజర్ కూడా ఇక్కడి రావడానికి ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకర్ని ఇక్కడ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమిస్తారనే ప్రచారం గత నెల రోజులుగా జరుగుతోంది. ఈలోగా ఎఇ సూరినాయుడుకు పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పురపాలన ఏదో విధంగా సాగిపోతున్నదనే ధీమాతో ఉన్నతాధికారులు ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్న అధికారుల్లో ఎవరో ఒకరు మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి నియామకానికి అవసరమైన ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వారు ఆవిధంగా వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో కమిషనర్ నియామక ప్రక్రియ జాప్యం అవుతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.
డిప్యూటీ సిఎం లేఖకు మోక్షమెప్పుడో?
స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం రాజన్నదొర మున్సిపల్ కమిషనర్‌గా పాలకొండ నగర పంచాయతీ మేనేజర్ జయరాంను నియమించాలని సిఫార్సు లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సిఫార్సు లేఖ ఇచ్చి నెలరోజులు దాటిపోయింది. అయినా మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది. డిప్యూటీ సిఎం హౌదాలో ఉన్న రాజన్నదొర సిఫార్సుకే దిక్కు లేని పరిస్థితి ఏర్పడింది.










