ప్రజాశక్తి - ఆదోని
మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ఆదోని కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు జ్ఞానమద్దయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆదోనిలోని మున్సిపల్ పాఠశాలలో వారు మాట్లాడారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి విద్యా శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి పర్యవేక్షణ, పరిపాలన నిమిత్తం విద్యాశాఖ కిందికి వచ్చి సంవత్సరం గడిచినా పంచాయతీ రాజ్ వ్యవస్థలోని ఉపాధ్యాయుల మాదిరి మున్సిపల్ ఉపాధ్యాయులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరారు. సమాఖ్య నాయకులు ఆనంద్, సీనియర్ ఉపాధ్యాయులు నూర్ బాష, సర్తాజ్ పాల్గొన్నారు.