Oct 12,2022 22:54

డిఇఒకు ధర్నా నోటీసు ఇస్తున్న యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి - ఆరిలోవ : మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ఈ నెల 20న జిల్లా విద్యాశాఖ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ఉమ్మడి విశాఖ జిల్లా యుటిఎఫ్‌ నాయకులు బుధవారం విశాఖ డిఇఒ ఎల్‌.చంద్రకళకు ధర్నా నోటిస్‌ అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ అనకాపల్లి జిల్లా ప్రధానకార్యదర్శి గొంది చినబ్బారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా, దశాబ్దాలుగా మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులకు డిడిఒ అధికారాలు వెంటనే కల్పించాలని కోరారు. తద్వారా చాలా సమస్యలు పరిష్కారమౌతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి చిన్న అవసరానికి అటు భీమిలి నుంచి, ఇటు అనకాపల్లి వరకు జివిఎంసి పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్‌ ఉపాధ్యాయులు అధికారిక పనుల నిమిత్తం విశాఖపట్నం కమిషనర్‌ కార్యాలయానికి రావాల్సి వస్తోందన్నారు. హెచ్‌ఎంలకు డిడిఒ అధికారాలు కల్పిస్తే, సెలవులు, మెడికల్‌ లీవ్‌, ఇంక్రిమెంట్‌ మంజూరు, జీతాల బట్వాడా లాంటి సమస్యలు వారి పరిధిలో పరిష్కారమౌతాయన్నారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు పిఎఫ్‌ అకౌంట్లు ప్రారంభించాలని, వారి సర్వీసులన్నీ విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. 2015 అర్‌పిఎస్‌ నుంచి నుంచి బకాయిపడ్డ ఎరియర్స్‌ను వెంటనే ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 20న డిఇఒ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తామన్నారు.
దీనిపై డిఇఒ చంద్రకళ స్పందిస్తూ, మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్‌ తన దృష్టికి తెచ్చిన సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు కార్యక్రమంలో యుటిఎఫ్‌ విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి నాగేశ్వరరావు, తడాన అప్పారావు, కోశాధికారి అంబేద్కర్‌, కార్యదర్శి ఎం రామకృష్ణ , పాడేరు కార్యదర్శి రఘునాథ్‌ , జివిఎంసి కార్యదర్శి కె.రాంబాబు పాల్గొన్నారు.