Apr 04,2023 01:01
ఆర్డీవోను కలసి సమస్యను వివరించారు

ప్రజాశక్తి-చీరాల: 'ఆక్రమించడంలో తగ్గేదేలే' అంటూ ప్రజాశక్తి దినపత్రికలో ఇటీవల వచ్చిన కథనానికి ప్రజాసంఘాలు, చీరాల నియోజకవర్గ సాధన సమితి ప్రతినిధులు స్పందిస్తూ ఆర్డీవోను కలసి సమస్యను వివరించారు. పట్టణ నడిబొడ్డులోని ప్రధాన రహదారి పొలిమేర రోడ్డులో మున్సిపాలిటీ స్థలంలో అడ్డదారిలో అడ్డుగోలగా మూడు దుకాణాల నిర్మాణాలను చేపట్టారని, వాటికి మునిసిపల్‌ రెవెన్యూ అధికారులు కనీసం స్థలాన్ని పరిశీలించకుండా పులి వెంకటేశ్వర్లు, చుండూరు వెంకటస్వామిల పేరుతో పన్ను విధించడం వెనక ఆంతర్యం ఏమిటని చీరాల సాధన సమితి నాయకులు ప్రశ్నించారు. పట్టణంలో ప్రభుత్వ స్థలాలు అన్యక్రాంతం అవుతున్నాయని, తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షించాలని కోరుతూ సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గ సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారుల చెరలో పడకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తపేట కుందేరులో కొందరు దళారులు స్థలాలను ఆక్రమించుకొని అమ్మకాలు చేస్తున్నారని, అదేవిధంగా పొలిమేర రోడ్డులో ఏర్పాటు చేసిన మూడు దుకాణాలకు మున్సిపల్‌ అధికారులు పన్నులు విధించారని, ఏ ప్రాతిపదికన మున్సిపల్‌ రెవెన్యూ అధికారులు పన్నులు వేశారో ప్రజలకు బహిర్గతం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. తక్షణమే అన్యక్రాంతం అయిన ప్రభుత్వ భూములను తిరిగి ఉన్నత అధికారులు పూర్తి విచారణ చేపట్టి ఆ భూములను సంరక్షించాలని కోరుతూ ఆర్డీవో సరోజినికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాలు మరియు నియోజకవర్గ సాధన సమితి ప్రతినిధులు శీలం రవికుమార్‌, గుమ్మడి ఏసురత్నం ఊటుకూరు వెంకటేశ్వర్లు గూడూరు శివరాం ప్రసాద్‌ ఎన్‌ బాబురావు, ఏ బాబురావు, బాల అంకమ్మరావు తన్నీరు విజరు తదితరులు పాల్గొన్నారు.