
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్:స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. గురువారం చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యతక్షన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటు అధికారపాక్షం ప్రతిపక్షంతో పాటు జనసేన పార్టీ కౌన్సిలర్ వాదోపవాదనలతో సమావేశం ముగిసింది. అధికార పార్టీ కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీ 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి రోడ్డు విస్తరణ పై ధీటుగా నిలదీశారు. రోడ్డు విస్తరణ పై ప్రజలను పలు అనుమానాలు వేధిస్తున్నాయని ఈ అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలంటూ వాదించారు. రోడ్డు వెడల్పు 80 అడుగులా? లేక 90 అడుగులా
లేక 100 అడుగులా తెలియజేయాలని ప్రశ్నించారు. రోడ్డు విస్తరణపై సరైన విధానం లేకుండా చిరు వ్యాపారుల పొట్ట కొట్టారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరైన ప్రణాళిక లేకుండా ముందుగా చిరు వ్యాపారుల షాపులను కూల దీయడంతో వారు రోడ్డున పడ్డారన్నారు.
దీనికి వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ స్పందిస్తూ ఇంతకీ రోడ్డు విస్తరణ పై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల వైఖరి ఏమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రోడ్డు విస్తరణ జరగలేదని, అటువంటిది ఎమ్మెల్యే గణేష్ సాహసోపేతంగా విస్తరణ పనులు ప్రారంభించడం జరిగిందని, మీరు దీనికి అంగీకారమా కాదా అని రామకృష్ణ నిలదీశారు. ఈ మాటకు కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్, దనిమిరెడ్డి మధు స్పందిస్తూ తాము ఎప్పుడూ పేదల పక్షాన నిలబడతామని రోడ్డు విస్తరణకు తాము అంగీకారం గతంలోనే తెలపడం జరిగిందని తెలిపారు. రోడ్డు విస్తరణలో నష్టపోతున్న యజమానులకు టీడీఆర్ బాండ్లు కాకుండా నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు.
కౌన్సిలర్ రామరాజు స్పందిస్తూ గిరిజన గ్రామమైన తమ గ్రామానికి విద్యుత్, తాగునీటి సౌకర్యాన్ని రోడ్డు సదుపాయాన్ని కల్పించాలని కోరారు. పారిశుధ్య కార్మికులకు కనీసం చేతికి తొడుక్కునే గ్లౌజులు ఇవ్వలేని పరిస్థితిలో మున్సిపాలిటీ ఉందని, సబ్బులు, నూనెల బిల్లులు ఇవ్వకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని విమర్శించారు. అద్దేపల్లి సౌజన్య మాట్లాడుతూ, ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ పారిశుధ్యం పై ప్రశ్నిస్తూనే ఉన్నా స్పందించ లేదన్నారు.
చైర్పర్సన్ సుబ్బలక్ష్మి స్పందిస్తూ నెల రోజుల్లో పారిశుధ్య పరికరాలు పూర్తిస్థాయిలో వస్తాయని తెలిపారు.కమిషనర్ కనకారావు స్పందిస్తూ రోడ్డు విస్తరణ వంద అడుగులేనని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. కొందరు ఆమోదించినప్పటికీ మరికొందరు కోర్టుకు వెళ్లడంతో దీనిపై వేచి చూడాల్సి ఉందని ఆయన సమాధానం ఇచ్చారు.