అనంతపురం కార్పొరేషన్:నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన మున్సిపల్ పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బుధవారం నాడు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో నగర కార్యదర్శి వి.రామిరెడ్డి మాట్లాడుతూ అనంతపురం నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గత నెల 5వ తేదీన సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించామన్నారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంపై అధికారులు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదన్నారు. నగరంలో పలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడడంలో విఫలమైందన్నారు. చెత్త పన్ను రద్దు చేయాలన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులను పెంచాల్సి ఉందన్నారు. టిడ్కో ఇళ్లను అర్హులైన వారందరికీ వెంటనే ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న నడిమి వంక రక్షణ గోడలను నిర్మించి, నడిమి వంక, పెద్ద వంక, మరువ వంక పూడికతీత పనులను చేపట్టాలన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి అధికారులు పట్టించుకోలేదన్నారు. దీనిని నిరసిస్తూ నేడు జరిగే కార్పొరేషన్ సమావేశాన్ని ముట్టడిస్తామని చెప్పారు.
నేడు కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశం
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం స్థానిక కౌన్సిల్ హాలులో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి సంఘం శ్రీనివాసులు తెలిపారు. మేయర్ మహ్మద్ వసీం అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొనాలని కోరారు.










