జీతాలు చెల్లించేందుకు అధికారుల హామీ
ప్రజాశక్తి - ఏలూరు
మున్సిపల్ స్కూల్ స్వీపర్ల రిలే నిరాహార దీక్షలకు ఉన్నతాధికారులు స్పందించారు. డిఇఒ శ్యామ్‌సుందర్, మున్సిపల్ కమిషనర్ మంగళవారం సాయంత్రం దీక్షాశిబిరానికి చేరుకుని స్వీపర్ల బకాయి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఎనిమిది రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలను విరమించారు. వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ స్కూల్ స్వీపర్ల ఐదు నెలల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ ఈనెల మూడో తేదీన డిఇఒ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వీరికి వివిధ కార్మిక, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున మద్దతు తెలిపాయి. దీనిపై స్పందించిన అధికారులు జీతాలు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆందోళనకారులకు రాతపూర్వక ఉత్తర్వుల కాపీని అందజేశారు. దానిని మున్సిపల్ కమిషనర్ అమలు చేసేందుకు అంగీకరించారు. ఈ హామీ ప్రకారం గత ఎనిమిది రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలను విరమించినట్లు యూనియన్ గౌరవాధ్యక్షులు బి.సోమయ్య తెలిపారు. జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకున్న కలెక్టర్‌కు, జిల్లా విద్యాశాఖ అధికారికి, మున్సిపల్ కమిషనర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఎనిమిదో రోజు రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య ప్రారంభించారు. ఈ దీక్షలో మాధవి, లక్ష్మీ, సుజాత, ప్రమీళ, దుర్గా భవాని, రామలక్ష్మి, నూర్జహాన్, యాస్మిన్, కృష్ణవేణి, ఆదిలక్ష్మి, స్వాతి, ప్రియాంక, భారతి, పార్వతి, విజయలక్ష్మి పాల్గొన్నారు.










