Mar 02,2023 22:26

ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ నగరంలోని మునిసిపల్‌ పాఠశాలల్లో జరిగిన నాడు-నేడు పనులు అసంపూర్తిగా ఉన్నాయని, పూర్తి స్థాయిలో పనులు అయ్యేందుకు అధికార వైసిపి, అధికారులు దృష్టి సారించాలని మాజీ కార్పొరేటర్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్‌ డిమాండ్‌ చేశారు. కృష్ణలంక 21వ డివిజన్‌ వంగవీటి మోహన్‌రంగా ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలను సిపిఎం బృందం గురువారం సందర్శించి, అక్కడ నెలకొన్న పెండింగ్‌ సమస్యలను విద్యార్ధులు, పాఠశాల ఉపాధ్యాయుల నుంచి అడిగి తెలుసుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా కాశీనాథ్‌ మాట్లాడుతూ మునిసిపల్‌ పాఠశాలల్లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ...ఆ దిశగా నాడు-నేడు పనులు నిధుల సమస్యతో పూర్తి స్థాయిలో చేయడం లేదని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌ నగరంలోని మునిసిపల్‌ పాఠశాలల అభివృద్ది అంతగా జరగలేదన్నారు. గత ఆగస్టులో ప్రారంభమైన నాడు-నేడు పనులు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం శోచనీయమన్నారు. తరగతి గదులు, టారులెట్స్‌ నిర్మాణం జరగలేదన్నారు. ఇప్పటికే ఉన్న వాటిని తొలగించి, వాటి స్థానంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదన్నారు. సుమారు 16 టారులెట్స్‌ను కట్టాల్సి ఉందన్నారు. ముఖ్యంగా బాలికల పాఠశాలలో వాటి అవసరం ఎంతో ఉందన్నారు. రెండు ఎస్‌జిటి పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 240 మంది విద్యార్ధులున్న చోట 12 మంది స్టాఫ్‌ ఉండాల్సి ఉండగా, కేవలం ఇక్కడ 9 మంది మాత్రమే ఉన్నారన్నారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధిస్తున్న విఎం రంగా మునిసిపల్‌ పాఠశాలను కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కాలంలో అన్ని రకాలుగా అభివృద్ది జరిగిందని గుర్తు చేశారు. ఎపిఎస్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో కూడా ఇదే రకంగా సమస్యలు ఉన్నాయన్నారు. వర్షం కురిస్తే చెరువులా తయారవుతుందన్నారు. కనీస సదుపాయాలు లేక ఈ పాఠశాలలో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికార వైసిపి పాలకవర్గం, అధికారులు మునిసిపల్‌ పాఠశాలల అభివృద్దికి నాడు-నేడు పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు సిటీ కార్యదర్శివర్గ సభ్యులు పుప్పాల కృష్ణ, నాయకులు కోరాడ రమణ, శివాజి, గోపి తదితరులున్నారు.