Sep 24,2023 23:14

సమావేశంలో మాట్లాడుతున్న కె.ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. వడ్డేశ్వరంలోని కెబి భవన్‌లో తాడేపల్లి మండల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికుల విస్తృత సమావేశం సిఐటియు నాయకులు ఎన్‌.కిషోర్‌బాబు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పనిచేస్తున్న ఆయా గ్రామాల పారిశుధ్య కార్మికులకు చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు. చట్ట ప్రకారం రూ.15 వేల వేతనం, రూ.6 వేల హెల్త్‌ అలవెన్స్‌ మొత్తం రూ.21 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.12-15 వేలే ఇవ్వడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి దళితులు, గిరిజనులు, పేదలు పనిచేసే మున్సిపల్‌ రంగంలో చేసిన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. పారిశుధ్య కార్మికుల చేత వెట్టి చాకిరి చేయించుకొని కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కనీస సౌకర్యాలైన సబ్బులు, నూనెలు, కాళ్లకు చెప్పులు, శానిటైజర్స్‌ కార్మికులకు ఉచితంగా అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం 15 మందితో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల తాడేపల్లి మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చొక్కా మరియదాసు, ఉపాధ్యక్షులుగా గాజుల పిచ్చయ్య, కంచర్ల క్రాంతి, కార్యదర్శిగా మేకల డేవిడ్‌, సహాయ కార్యదర్శులుగా వంశీకృష్ణ, కృష్ణ తులసి, సరోజినీ, కోశాధికారిగా మారయ్య, మరో ఏడుగురు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ది గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు, సిఐటియు నాయకులు డి.వెంకటరెడ్డి, కౌలురైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పి.కష్ణ, మున్సిపల్‌ కార్మికులు నాగరాణి, వెంకటేశ్వర్లు, కోటేశ్వరి, సాంబయ్య పాల్గొన్నారు.