Aug 21,2023 20:34

నిరసన తెలుపుతున్న కౌన్సిలర్‌ ముబీనా సలీం, వార్డు ప్రజలు

మదనపల్లె అర్బన్‌ : తమ వార్డులో అభివద్ధికి మున్సిపల్‌ అధికారులు సహకరించడం లేదని అధికార పార్టీకి చెందిన 22వ వార్డు కౌన్సిలర్‌ ముబీనా సలీం అన్నారు. మున్సిపాలిటిలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో మున్సిపల్‌ కార్యా లయం ఎదుట వార్డు ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా వార్డు అభివద్ధికి సహకరించని మున్సిపల్‌ కమిషనరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషా ప్రజలు అభివద్ధి సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంటే ఎమ్మెల్యే, కౌన్సిల్‌ ఆమోదించి జరుగుతున్న పనిని ప్రజలకు అసౌకర్యంగా మధ్యలో ఎందుకు ఆపివేశారో వార్డు ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. మైనార్టీ మహిళా కౌన్సిలర్‌ అంటే చులకనగా ఉందా అని ప్రశ్నించారు. తన వార్డులో అభివద్ధికి సహకరించుకుంటే సహించేది లేదన్నారు. సమాధానం చెప్పకుంటే ధర్నా చేస్తామని చెప్పినా కమిషనర్‌ స్పందించకపోవడంతో ఆమె నిరసన తెలిపి ధర్నాకు పునుకొని, కమిషనర్‌ వైఖరిని వ్యతిరేకిస్తు నినాదాలు చేశారు. కాగా కౌన్సిలర్‌ ధర్నాతో కార్యాలయంలోని ప్రజల రాకపోకలకు అడ్డంకిగా ఉన్నారని స్థానిక వన్‌ టౌన్‌ పోలీసులు రంగప్రవేశం చేశారు. ధర్నాను విరమించాలని ఎస్‌ఐ హరిహర ప్రసాద్‌ నచ్చచెప్పినా ఆమె అంగీకరించ పోవడంతో అరెస్టు చేసి వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషనుకు తరలించారు. ఈ సందర్బంగా కౌన్సిలర్‌ ముబీనా సలీం మాట్లాడుతూ మున్సిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వార్డులో ప్రజలు మనోభావాలను గౌరవిస్తూ అసంపూర్తిగా నిలిపి వేసిన రోడ్డు పనిని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే కమిషనర్‌ వైఖరిపైన ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ దష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.