సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపల్ కార్యాలయాలను కార్మికులు ముట్టడించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ కార్యాలయాల్లో అధికారులను, ఉద్యోగులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళన వద్దకు చేరుకున్న పోలీసులు కార్మికులను, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సాలూరులో 24మందిని, పాలకొండలో 58మంది కార్మికులను, నాయకులు అదుపులోకి తీసుకొని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
ప్రజాశక్తి - సాలూరు: సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం ముఖద్వారం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్వైనాయుడు ఆధ్వర్యాన కార్మికులు బైఠాయించారు. కార్యాలయం ముందు వెనుక ద్వారాల వద్ద కార్మికులు బైఠాయించారు. దీంతో మున్సిపల్ ఉద్యోగులు సుమారు రెండు గంటల పాటు బయటనే నిరీక్షించాల్సి వచ్చింది. మున్సిపల్ మేనేజర్ రాఘవాచార్యులు పట్టణ సిఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కార్మికులను అడ్డు తొలగించారు. టౌన్ ఎస్‌ఐలు నర్సింహమూర్తి మూర్తి, భాస్కరరావు ఆధ్వర్యాన పోలీసులు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్వైనాయుడుతో పాటు 25మందిని కార్మికులను అరెస్టు చేశారు. అంతకు ముందు కార్మికుల నుద్దేశించి ఎన్వై నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు సిఎం జగన్ మోహన్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని చెప్పారు. గడచిన నాలుగేళ్లలో ఏటా కార్మికులకు పంపిణీ చేయాల్సిన చెప్పులు, సబ్బులు, నూనెలు పంపిణీ చేయలేదని చెప్పారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ విధానం రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు టి.రాముడు, టి.శంకరరావు, టి.ఇందు, ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాస్, డిరు సంతోష్ పాల్గొన్నారు.
పార్వతీపురంటౌన్ : మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధ, ఉపాధ్యక్షులు వి.ఇందిర డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం వద్ద కార్మికులు బైఠాయించి, నిరసన తెలియజేస్తూ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ఒకానొ దశలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు కార్యాలయంలోని విధులు నిర్వహిస్తున్న అధికారులు కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, కార్మికులు వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వివాదం జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించారు. కొంత సమయం తర్వాత సిఐ కృష్ణారావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని కమిషనర్ జె.రామ అప్పలనాయుడుతో సమావేశమై కార్మికులతో మాట్లాడించారు. ఈ సందర్భంలో కమిషనర్‌తో కార్మికులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగమైన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి నాలుగేళ్లయినా నేటికీ ఆ హామీని అమలు జరపలేదని అన్నారు. పర్మినెంట్ కార్మికులకు ఇచ్చిన వేతనాన్ని తమకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేయాలని, హెల్త్ అలవెన్స్ విడుదలకు చర్యలు చేపట్టాలని, పట్టణంలో పెరుగుతున్న జనాభాకు తగినంత మంది కార్మికుల సంఖ్యను పెంచి ఉన్న కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ మీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసనను విరమించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, పట్టణ నాయకులు సంచాన ఉమామహేశ్వరరావు, బంకురు సూరిబాబు, కార్మికులు నాగవంశం శంకర్రావు, చీపురుపల్లి సింహాచలం, నాగవంశం మల్లేషు, నాగవంశం నిర్మల, పడాల గాంధీ, మామిడి శివ, బంగారి రాజేష్, బంగారి రవి, మహిళా కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు పాల్గొన్నారు.
పాలకొండ: సమస్యలను రపిష్కరించాలని కోరుతూ నగర పంచాయతీ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి అన్ని వర్గాలు కోరారు. తొలుత నగరపంచాయతీ కార్యాలయం ముందు కార్మికులు బైఠాయించి అధికారులను, సిబ్బందిని ఎవర్నీ లోపలికి వెల్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కార్మికులకు నగర పంచాయతీ మేనేజర్‌కు వాగ్వివాదం జరిగింది. వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాలా రమణారావు పాటు కాద రాము మున్సిపల్ కార్మికులు 58 మందిని అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఐక్య పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నగర పంచాయతీ అధ్యక్షులు పడాల భాస్కరరావు, కార్యదర్శి చింతల సంజీవి, కోశాధికారి పడాల వేణు, ఉపాధ్యక్షులు చింతల సురేష్, కార్యవర్గ సభ్యులు రఘు, శ్రీదేవి, విమల, వండాన ఆంజనేయులు, సిఐటియు మండల సమన్వయ కమిటీ కార్యదర్శి కాద రాము, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ సెక్షన్ ట్రాక్టర్ డ్రైవర్లు వివిధ విభాగాల పనిచేస్తున్న కార్మికులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










