Aug 17,2023 20:54

మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు

 రాయచోటి టౌన్‌ : మున్సిపాల్టీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పాదయాత్ర లో ఇచ్చిన హామీ ప్రకారం పర్మినెంట్‌ చేయాలని సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు పేర్కొన్నారు. గురువారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలటీలో పనిచేస్తున్న మున్సిపల్‌ వర్కర్స్‌ను రెగ్యులర్‌ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పర్మినెంట్‌ చేస్తానని కార్మికులతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చినతర్వాత ఆప్కాస్‌లో చేర్చి చేతులు దులుపుకొందని చెప్పారు. క్లాప్‌ డ్రైవర్లకు కనీసవేతనం రూ.18500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం తీర్పు ప్రకారం పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, కనీసంంగా రూ.26 వేలు ఇవ్వాలన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ నాయకులు అగ్గిరామయ్య, రాంబాబు మాట్లాడుతూ మూడు ఖాతాల్లో ఉన్న ఫీఎఫ్‌ ఖాతాలను ఒక ఖాతాగా మార్చాలని కొబ్బరినూనె, చెప్పులు, మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం పాటు రిటైర్డ్‌ మెంట్‌ భెనిఫిట్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశౄరు. చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో వై.వి. రమణ, చెన్నయ్య, తిరుపాల్‌, లక్ష్మిదేవి, రవి, మధు, శిద్దమల్లు, జి.వి. రమణ, తిరుపతమ్మ, మంగమ్మ, మాధవి, రమేష్‌, కార్మికులు పాల్గొన్నారు.