Mar 17,2023 22:38

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొండపల్లి కమిటీ ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి మహేష్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్‌ చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికులకు రెండు జతల బట్టలు, కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు, లైఫ్‌ జాకెట్స్‌ ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న రెండు నెలల జీతాలు, ఏరియర్స్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దేవుళ్లు అప్పారావు, సూరిబాబు, రమణ, సింహాచలం, నాగేశ్వరరావు, మణికంఠ, అప్పల నరసమ్మ, మాణిక్యం, సూరి, లక్ష్మి, రమణమ్మ,నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-నందిగామ: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నందిగామ మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు శుక్రవారం ధర్నా చేశారు. మున్సిపల్‌ అధికారి ప్రసాద్‌కి అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కె.గోపాల్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ కార్డులు, రిస్క్‌ అలవెన్స్‌ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సలికేటి నరేష్‌, పుట్ట మాణిక్యం, మాడుగుల నాగరాజు, ఖమ్మంపాటి రూతమ్మ, బేబీ, పిచ్చయ్య, నతానేలు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.