మున్సిపల్ కార్మికులకు బకాయి జీతాలు, హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి
ప్రజాశక్తి - ఆత్మకూర్
మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు, హెల్త్ అలవెన్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయు పట్టణ కార్యదర్శి రామ్ నాయక్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు గొడుగు రాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద శానిటేషన్ అధికారి జీవన్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతినెల 1వ తేదీన ఠంచనుగా జీతాలు చెల్లిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ఆప్కాస్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఏప్రిల్ 11వ తేదీ వచ్చినప్పటికీ నేటికీ మార్చి నెల జీతాలు కార్మికులకు చెల్లించలేదు. మున్సిపల్ కార్మికులలో దళితులు ఎక్కువగా ఉన్నారని, వీరు ఘనంగా జరుపుకునే ఈస్టర్ పండుగ ఉన్నప్పటికీ కార్మికులకు జీతాలు చెల్లించకుండా కార్మికుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కట్ల పాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి కార్మికులకు నేరుగా చెల్లించే హెల్త్ అలవెన్సు ను సహితం చెల్లించకపోవడం విచారకరం అన్నారు. ఆప్కాస్ వ్యవస్థ ద్వారా 60 ఏళ్లు నిండిన వారిని బలవంతంగా ఉద్యోగాలను తొలగించారు వారి స్థానంలో వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక మున్సిపాలిటీలో కార్మికుల కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్నారు . వాస్తవానికి మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు గ్రాట్యుటీ కూడా చెల్లించాలి. ఇవేవీ మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయకుండా ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయిస్తున్నాయన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు రామన్న, రాజేంద్ర, విజయ్ కుమార్, రమేష్, భూషన్న, లింగస్వామి, దానమయ్య, చిన్న నందయ్య, మరియమ్మ, దర్గమ్మ, సుశీలమ్మ, రుతమ్మ, తదితరులు పాల్గొన్నారు.










