బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు
మున్సిపల్ కార్మికుల ఉద్యోగభద్రత కోసం
24న చలో విజయవాడ
-నగరంలో స్కూటర్ ర్యాలీ
ప్రజాశక్తి-నెల్లూరు:మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదిన నిర్వహించతలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలంటూ నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. సోమవారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నగరంలోని సర్వోదయ కళాశాల క్రీడా మైదానం నుంచి బోసుబొమ్మ ప్రాంతంలోని ఏబిఎం కాంపౌండ్ వరకు భారీ స్థాయిలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిఐటియు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు ఆద్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జి.నాగేశ్వరరావు, సిఐటియు రూరల్ అధ్యక్షులు కొండా ప్రసాద్‌లు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు వైసిపి నాయకులు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందంటూ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో, అధికారంలోకి వచ్చిన అనంతరం అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని వాగ్దానం చేశాడని అన్నారు. ఆర్భాటంగా హామీలు చేసి మున్సిపల్ కార్మికుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన అనంతరం చేసిన వాగ్దానాలను విస్మరించడం సరికాదన్నారు. కరోనాకాలంలో వారియర్స్ గా పని చేసిన మున్సిపల్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో మున్సిపల్ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. పర్మినెంట్ చేయకపోతే ఆందోళన ఉదతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పర్మినెంట్ చేయాలని ఆగస్టు 24న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో వేలాదిగా కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయకపోగా అబద్ధం ప్రచారాలతో, అవాస్తవ ప్రకటనలతో కార్మికులను గందరగోళ పరిచే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో నిరవధిక సమ్మెకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.పెంచలనరసయ్య, మూలం ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆశోక్, బాలు, క్రిష్ణ, ఆనంద్, దేశమూర్తి, సుబ్బు, మనోజ్, రమేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.










