మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు
- కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లాలోని మున్సిపాలిటీలలో పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు సోమవారం నంద్యాల కలెక్టరేట్ ముందు మున్సిపాలిటీలలో వివిధ సెక్షన్లలో పని చేస్తున్న కార్మికులు సిఐటియు, ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. జీవో 151 ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అర్హత కలిగిన కాంట్రాక్టు కార్మికులందరికీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ ఏపిసిఓఎస్ నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు. రూ.6 వేలు హెల్త్, రిస్క్ అలవెన్సులు చెల్లించాలన్నారు. పనిముట్లు, రక్షణ పరికరాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు పూర్తి అయ్యి రిటైర్డు అయిన వారికి బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె.మహమ్మద్ గౌస్‌లు మాట్లాడారు. అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు భాస్కరాచారి, కృష్ణయ్య, రామకృష్ణ, ఆదాము, కరిముల్లా, నాగేశ్వరరావు, ఈశ్వరయ్య, రామాంజనేయులు, నాగేంద్రప్రసాద్, ప్రసాద్ రావు, మురళీ, కర్ణ కుమార్, గురువేశ్వరుడు, డోన్ మున్సిపాలిటీ నాయకులు కుల్లాయప్ప, పెద్ద ఎల్లయ్య, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ నాయకులు సాల్మన్, అధ్యక్షుడు వెంకటయ్య, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










