ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఎఐటియుసి) శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం రూ.26 వేలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ, నగర పంచాయతీ, కార్పొరేషన్లు, మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ ఏడాది దాటినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ కార్మికులకు జిపిఎఫ్ ఖాతాలు ప్రారంభించలేదన్నారు. పర్మినెంట్ కార్మికులకు రెండు సంవత్సరాలైనా సరెండర్ లీవులు నగదు రూపంలో చెల్లించలేదని విమర్శించారు. ఇంజనీరింగ్ కార్మికులు, వాటర్ వర్కర్స్, ఎలక్ట్రికల్స్, వెల్డింగ్, స్వచ్ఛభారత్, క్లాఫ్ డ్రైవర్లకు హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక నగరపాలక సంస్థలో విలీనమైన 7 పంచాయతీ కార్మికులకు గత ఏడాది జూన్‌నెల జీతం చెల్లించాలని, ఆప్కాస్ కార్మికులకు ప్రతినెల జీతంతో పాటు, హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. ఈ హామీలు అధికారులు అమలు చేయని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు నగర అధ్యక్షులు యలగాడ దుర్గారావు, ఉపాధ్యక్షులు దొడ్డికర్ల నాగబాబు పాల్గొన్నారు.
చింతలపూడి: రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ పర్మినెంట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఎఐటియుసి) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోర్లపాటి బాబు తెలిపారు. పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చింతలపూడి నగర కమిషనర్ ద్వారా కలెక్టర్‌కి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికుల జిపిఎఫ్ ఖాతాల తెరవింపు, సరెండర్ లీవుల ఎన్‌కేష్‌మెంట్ రెండేండ్లు దాటినా విడుదలవ్వకపోవడంపై ప్రభుత్వంలో చలనమే లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. వినతిని సమర్పించిన వారిలో ఎఐటియుసి నాయకులు కంచర్ల గురవయ్య, పారిశుధ్య కార్మికులు వెలగాడి అనురాధ, వడిత్య బాలు, బొత్స నారాయణ, బొత్స రాజేష్ పాల్గొన్నారు.










