Aug 21,2023 21:58

హిందూపురంలో ర్యాలీని ప్రారంభిస్తున్న ఇఎస్‌ వెంకటేష్‌

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జి ఎల్‌ నరసింహులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని. సిపిఎస్‌ ను రద్దు చేయాలని చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు కోరారు. ఈసందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆర్‌ అండ్‌ బి బంగ్లా నుండి అంబేద్కర్‌ సర్కిల్‌, ఇందిరాగాంధీ సర్కిల్‌, జిమాన్‌ సర్కిల్‌, ఎగ్బాల్‌ రోడ్‌, హిందూపూర్‌ క్రాస్‌ టవర్‌ క్లాక్‌ మీదుగా మున్సిపల్‌ కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కార్మికుల రెగ్యులర్‌ చేయాలని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ పట్టణ అధ్యక్షులు జనార్ధన, కార్యదర్శి బాలకృష్ణ, జిల్లా కోశాధికారి తిరుపాలు, నరసింహమూర్తి, రాజు, చెన్నకృష్ణ, రామాంజులు, చంద్రప్ప, సిఐటియు నాయకులు జి.ఎల్‌. నరసింహులు, సాంబశివ, జగన్మోహన్‌, రామ్మోహన్‌,ముస్తక్‌, నారాయణ పాల్గొన్నారు.
హిందూపురం : మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 24వ తేదీన చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని ఇందిరా పార్కును నుండి మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో కార్మికులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ ఎస్‌ వెంకటేష్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా వెంకటేష్‌ మాట్లాడుతు మున్సిపల్‌ కార్మికుల, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, టైమ్‌ స్కేల్‌ వర్తింపజేయాలని, కార్మికులను వెంటనే పర్మినెంటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సిఐటియూ అనుబంధ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆ నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి పి నరసింహప్ప, పట్టణ అధ్యక్షులు జగదీష్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మల్లికార్జున, ఆనంద్‌, రామాంజినప్ప, బాబయ్య, రామచంద్ర, చంద్ర, బాలాజీ, మంజు తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : మునిసిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు నాయకులు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ, అయూబ్‌ ఖాన్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామనిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున తో పాటు షేక్షావలి, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష,కార్యదర్శులు బాబు, చెన్నకేశవులు, గౌరవ అధ్యక్షులు పుల్లన్న, ప్రసాద్‌, ముకుంద, వెంకటేష్‌, వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.