Jun 06,2023 23:49

మంత్రి అమర్‌నాథ్‌కు వినతిపత్రం అందిస్తున్న వెంకటరెడ్డి తదితరులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : మున్సిపల్‌ కార్మికుల సమస్యలను బుధవారం జరగనున్న రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో చర్చించి పరిష్కరించాలని జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఆయన గృహంలో కలిసి యూనియన్‌ తరపున వినతిపత్రం అందించారు. అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జివిఎంసిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో సమ్మె చేసిన సందర్భంగా అప్పటి కమిషనర్‌, ఇంజినీరింగ్‌ చీఫ్‌లతో ఒప్పందం జరిగిందని, మినిట్స్‌ కూడా రాసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీలోగా వాటిని అమలు చేయాలని, లేకుంటే 19వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. మంత్రి అమర్‌నాథ్‌ కల్పించుకొని ఈ సమస్యను కేబినేట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కరోనా సమయంలో విధులు నిర్వహించిన 18 మంది పారిశుధ్య కార్మికులు మృతిచెందారని, ఆయా కుటుంబాలకు కేంద్రం నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి పరిహారమూ అందలేదన్నారు. కార్మికులకు గ్రాట్యూటీ చెల్లించని కారణంగా, వారి పిల్లలకు వారసత్వంగా అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధి కల్పించడం లేదని తెలిపారు. 2008 జివిఎంసి కౌన్సిల్‌ తీర్మానం ప్రకారం, నేటి వరకు చనిపోయిన వారి పిల్లలకు, 60 ఏళ్లకు రిటైర్‌ అయిన, లాంగ్‌ ఆబ్సెంట్‌ అయిన కార్మికులు, అనారోగ్య కార్మికుల కుటుంబ సభ్యులకు అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధి కల్పిస్తామని అంగీకరించారని గుర్తుచేశారు. ఆ నిర్ణయాలను నేటికీ అమలుచేయలేదన్నారు. ఇప్పటికైనా అటువంటి వారందరికీ ఉపాధి కల్పించాలని కోరారు. జివిఎంసిలో భర్తీ చేయనున్న 482 ఖాళీలలో కార్మికుల వారసులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌, నీటి సరఫరా విభాగాలలో వాల్వ్‌ ఆపరేటర్లు, ఎలక్ట్రికల్‌ హెల్పర్స్‌, ఫిట్టర్‌ హెల్పర్లు, గార్డెనర్లకు సెమీ స్కిల్డ్‌ వేతనాలు చెల్లించాలని కోరారు. జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు సెమీ స్కిల్డ్‌ వేతనం రూ.18,500 ఇవ్వాలన్నారు. మంత్రి అమర్‌నాథ్‌తో పాటు అక్కడే ఉన్న గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే ఎ.అదీప్‌రాజ్‌కు కూడా వినతి పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఉరుకుటి రాజు, జి.అప్పారావు, ఎంవి.ప్రసాదరావు, నీటి సరఫరా విభాగం నాయకులు శంకరరెడ్డి, మహేశ్వరి, క్లాప్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు సురేష్‌, నాగరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీర రమణ తదితరులు పాల్గొన్నారు.