ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : జివిఎంసిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లూరి విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) విశాఖ జిల్లా 10వ మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పి వైసిపి ప్రభుత్వం మోసగించిందన్నారు. పైగా ఆప్కాస్ పెట్టి కార్మికులకు శాశ్వత ఉద్యోగాలు రాకుండా కుట్రపన్నిందని విమర్శించారు. పారిశుధ్య కార్మికులకు హెల్త్ అలవెన్సు, జీతాలు బకాయిలు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. జివిఎంసి పాలకవర్గం ప్రజలపై పన్నులు భారీగా వేసి, ముక్కుపిండి వసూలు చేస్తోందని, కార్మికుల సంక్షేమం, నగర అభివృద్ధి మాత్రం విస్మరిస్తోందని విమర్శించారు. పనిముట్లు నుంచి పలు వస్తువలను కార్మికుల డబ్బులతో కొనిపిస్తుందని పేర్కొన్నారు. సమస్యలపై కార్మికులు చేసే పోరాటాల్లో సిఐటియు అండగా ఉంటుందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాసే విధానాలు అవలంభిస్తున్నాయని, వీటిని ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు పి.వెంకటరెడ్డి, జి.సుబ్బారావు మాట్లాడుతూ, ఆప్కాస్ నుంచి మున్సిపల్ కార్మికులను తప్పించి పర్మినెంట్ చేయాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. సమానవేతనం రూ.28వేలు, పర్మినెంట్‌కోసం సమ్మెకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభలు అనంతపురంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఉన్నాయని, అందులో భవిష్యత్తు పోరాటాలకు దిశా నిర్ధేశం చేయనున్నట్లు తెలిపారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్స్ పి.వెంకటరెడ్డి, జి.సుబ్బారావు గౌరవాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అధ్యక్షునిగా టి.నూకరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.రత్నం, ప్రధాన కార్యదర్శిగా ఉరుకూటి రాజు, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎంవి.ప్రసాదరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వి.కృష్ణారావు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా గొలగాని అప్పారావు, కోశాధికారిగా ఎం.సూరీడు, మరో 39 మంది కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.










