Aug 17,2023 22:48

ఇచ్ఛాపురం : మానవహారం నిర్వహిస్తున్న కార్మికులు

* 21న బైక్‌ ర్యాలీ
* 24న చలో విజయవాడ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌, ఇచ్ఛాపురం : 
మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.రమేష్‌ కుమార్‌ పట్నాయక్‌, ఎన్‌.బలరాం, ఉపాధ్యక్షులు ఎ.గణేష్‌ విమర్శించారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 24వ తేదీన చలో విజయవాడ తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫెడరేషన్‌ ఆధ్వర్యాన శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు కూడలి వద్ద, ఇచ్ఛాపురం పట్టణంలోని బస్టాండ్‌ కూడలి వద్ద గురువారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 వేతనం చెల్లించాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఆరు నెలల్లో పర్మినెంట్‌ చేస్తామని చెప్పి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కరినీ పర్మినెంట్‌ చేయలేదన్నారు. నమ్మి ఓట్లు వేసి గెలిపించిన మున్సిపల్‌ కార్మికులను నట్టేట ముంచారని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులను ఆప్కాస్‌లో చేర్చి శాశ్వత బానిసలను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థ ద్వారా క్లాప్‌ డ్రైవర్లను నియమించి కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం ఈనెల 21న బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో, లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు మున్సిపల్‌ కార్మికులు, సిపిఎస్‌, ఆప్కాస్‌ ఉద్యోగులు, క్లాప్‌ డ్రైవర్లు పోరాటాల్లో పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ఫెడరేషన్‌ నాయకులు కళ్యాణ రాజు, ఎ.రాము, శేఖర్‌, డి.చిట్టిబాబు, ఎ.జనార్థన్‌, పార్వతి, గంగాధర రౌతో, రవి లిమాయి, బృంద బంగారి తదితరులు పాల్గొన్నారు.