Aug 16,2023 00:44

ప్రజాశక్తి-తెనాలి : ప్రజారోగ్య పర్యవేక్షణలో నిత్యం సేవలందిస్తున్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్‌ మార్కెట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సమస్యలపై మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేసి, శాశ్వత ప్రాతిపదికన వైధ్యుడిని నియమించాలని కోరారు. సమావేశంలో సిపిఎం నాయకులు ములక శివ సాంబి రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్‌ వెంకటేశ్వర్లు, సుధాకర్‌, మరియమ్మ, మాధవి, సునీత, గౌరమ్మ, అనురాధ, సారమ్మ, సంతోషం, నాగలక్ష్మి పాల్గొన్నారు.
డాల్‌ మిల్‌ ముఠా కార్మిక సంఘం నిరసన
డాల్మిల్‌ ముఠా కార్మికుల సమస్యల పరిష్కరిం చాలని కోరుతూ మంగళవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ మున్సిపల్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ వద్ద నిరసన వ్యక్తం చేసి, గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ముఠా కార్మికుల సమస్యలు పరిష్కారానికి చట్టం తేవాలని, కార్మికులకు ప్రతిరోజు పని కల్పించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, ఈఎస్‌ఐ ఈపీఎఫ్‌ కార్మికులందరికీ అమలు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో జి వెంకటసుబ్బయ్య, సిహెచ్‌ శేషగిరిరావు, స్టాలిన్‌, శ్రీనివాసరావు, రంగయ్య ,వెంకట రమణారెడ్డి శివారెడ్డి, షేక్‌ హుస్సేన్‌ వలి పాల్గొన్నారు.