ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : సమస్యలు పరిష్కరించాలని, ఆప్కాస్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ నగర పంచాయతీలో మున్సిపల్ కార్మికులు సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల సెంటర్ వరకు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నాగవంశం శంకర్రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి నేటికీ హామీ అమలు కాలేదని విమర్శించారు. ఇంజినీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్, క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 జీతం చెల్లించాలని, రెండు నెలల జీతం సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ కార్మికులకు గతంలో సంక్రాంతికి ఇచ్చిన బట్టలకు కుట్టుకూలి అలవెన్స్ ఇవ్వాలని కోరారు. బకాయి డిఎలు చెల్లించాలని, సరెండర్ లీవ్ ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద తలపెట్టిన వాంటావార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికులు చీపురుపల్లి సింహాచలం, మల్లేశు, రాజేష్, శివ, గంగయ్యలు, నిర్మల, అప్పులమ్మ, విప్పలమ్మ, సుజాత, గంగరాజు, శ్రీను, శివ పాల్గొన్నారు.
సాలూరు: సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు అద్వర్యాన నిర్వహించిన ర్యాలీ గాంధీనగర్ లో మొదలై ప్రధాన రహదారి మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. జిల్లాలోని మున్సిపల్ కార్మికులతో మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహిస్తామని చెప్పారు. మున్సిపాలిటీలలో పని చేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికుల ను రెగ్యులర్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు టి.శంకరరావు, స్వప్న, బాలరాజు, టి.రవి, టి.రాముడు పాల్గొన్నారు.
పాలకొండ : స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పడాల భాస్కరరావు, చింతల సంజీవి పడాల వేణు మాట్లాడారు. కార్యక్రమంలో చింతల సురేషు, ఎన్.సాయి, వి.ఆంజనేయులు, కె.నరసింహ, బి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.